ఇంత నీచ పాలన నా జీవితంలో చూడలేదు: చంద్రబాబు
హైదరాబాద్: ఇంత నీచమైన పాలన తన జీవితంలో చూడలేదని, ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. తన నివాసంలో బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దేశ ప్రజల అన్ని రకాల కష్టాలకు బరితెగించిన కాంగ్రెసు పాలననే కారణమన్నారు.
ప్రధానమంత్రి సంతకం చేసిన పైళ్లు మాయమవుతున్నాయని విమర్శించారు. అన్నింటిలోకి ఎఫ్‌డిఐలను అనుమతించినా పెట్టుబడులు రావడం లేదని, మరోవైపు రూపాయి విలువ పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. అవినీతి విచ్చవిడిగా పెరిగిందని, ధరలు పెరుగుతున్నాయని, యూపిఏ ప్రభుత్వం కుంభకోణాలమయమని దుయ్యబట్టారు.

కాంగ్రెసు అవినీత వల్లనే ధరలు పెరిగాయన్నారు. కొంతమంది వ్యక్తుల స్వార్థానికి దేశం బలవుతోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఎవరికి తోచినట్టు వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుకు కారకులెవరని ప్రశ్నించారు. ఫైల్ మిస్సింగ్ పైన ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెసు పాలనలో ఎదురుదాడి తప్ప జవాబుదారీతనం లేదని, రోగం గుర్తించకుండా మందు వేస్తే ఎలా అన్నారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి రోగం వచ్చిందన్నారు. ఆర్థిక వృద్ధి రేటు తగ్గటం వల్ల నిరుద్యోగం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. యూపిఏ దేశాన్ని భ్రష్టు పట్టించిందన్నారు.












Click it and Unblock the Notifications