విభజన సాకు: బావ చంద్రబాబుపై హరికృష్ణ ఫైట్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తన బావ నారా చంద్రబాబు నాయుడిపై చాలా కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాష్ట్ర విభజనను సాకుగా తీసుకుని సమరానికి సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు వైఖరిని ధిక్కరిస్తూ నందమూరి హరికృష్ణ సమైక్య నినాదాన్ని అందుకున్నట్లు చెబుతున్నారు. సమైక్య నినాదంతో సీమాంధ్రలో చంద్రబాబు కన్నా ముందే పర్యటించి తన సత్తా చాటుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరున తిరుపతి నుంచి గానీ విశాఖపట్నం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి, విభజన వ్యవహారంలో కాంగ్రెసు వైఖరిని దుయ్యబట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే, ఆయన కన్నా ముందుగానే హరికృష్ణ సీమాంధ్రలో పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఢిల్లీ నుంచి సోమవారం బహిరంగ లేఖను విడుదల చేసినట్లు చెబుతున్నారు. ఆత్మావిష్కరణ పేరుతో ఆయన ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.

పార్టీ కార్యకర్తగా తాను తాను మొదట పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించానని, కానీ ఏకాభిప్రాయంతో విభజన జరపకుండా ఒక ప్రాంతంవారికి ఆమోదయోగ్యం కాని రీతిలో జరిపిన కాంగ్రెసు పార్టీ రాష్టర్ంలో రాష్ట్రం కాష్టంగా మార్చిన నేపథ్యంలో సమైక్యాంధ్ర విధానానికే కట్టుబడి ఉండడం సమర్థనీయమని ఆత్మ ప్రబోధంతో అడుగు ముందుకు వేస్తున్నానని హరికృష్ణ అన్నారు.
పైగా, తన బహిరంగ లేఖను ఆయన పార్లమెంటు ఆవరణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కాకుండా బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి మీడియాకు ఫాక్స్ చేశారు. తమ పార్టీ కార్యాలయం నుంచి చేస్తే చంద్రబాబుకు ముందుగానే చేరవేస్తారని భావించి అలా చేసి ఉంటారని భావిస్తున్నారు. కానీ, దీని వెనక కాంగ్రెసు వ్యతిరేక విధానాలను అనుసరించాలనే బిజెపి ఎత్తుగడలు కూడా ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తెలంగాణ విషయంలో తనదే తుది నిర్ణయమని చంద్రబాబు హరికృష్ణ అభిప్రాయం స్పందిస్తూ అన్నారు. హరికృష్ణ వ్యవహారాన్ని చంద్రబాబు చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. హరికృష్ణ తన మార్గమేదో తాను వెతుక్కోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications