యుటి అంటే నాలుక కోస్తాం: చిరంజీవిపై హరీష్
హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని అంటే నాలుక కోస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సమన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్న విషయం తెలిసిందే. హైదరాబాదును యుటి చేయాలని ఎవరు అడిగినా నాలుక కోస్తామని హరీష్ రావు అన్నారు. చిరంజీవి డిమాండ్‌ను ఉద్దేశించే హరీష్ రావు ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జరుగుతున్న ఆందోళనలకు, తెలంగాణలోని ఆందోళనలకు మధ్య రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వైద్యులు చేపట్టిన శాంతిదీక్ష కార్యక్రమంలో ఆయన శనివారంనాడు ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టాలని తలపెట్టిన తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్షా స్థలికి వెళ్లక ముందే అరెస్టు చేసి, వేరే జిల్లాలోని ఆస్పత్రికి తరలించారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు పోలీసు రక్షణ కల్పించారని ఆయన అన్నారు.
ఎస్కార్టులు పెట్టి వైయస్ విజయమ్మను దీక్షలో కూర్చోబెట్టారని, పోలీసు రక్షణ కల్పించి దీక్షకు అనుమతిచ్చారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ర్యాలీలకు అనుమతి అవసరం లేదా, తెలంగాణలోని ర్యాలీలకు మాత్రమే అనుమతి అవసరమా అని ఆయన అడిగారు. తెలంగాణలోని ఏ కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి సమైక్యాంధ్ర ఆందోళనలకు ఎలా అనుమతి ఇస్తారని ఆయన అడిగారు. తెలంగాణలో ర్యాలీలు చేస్తే అరెస్టు చేస్తారని ఆయన చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి, డిజిపి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేర్వేరు చట్టాలున్నాయని ఆయన ప్రశ్నించారు.

తాము ఆందోళనలు చేస్తే తాలిబాన్లు, నక్సలైట్లు అని అన్నారని, కెసిఆర్‌ను ముల్లా అని అన్నారని, సీమాంధ్ర నాయకులు ఎలా మాట్లాడుతున్నారో చూడాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఏమన్నారో చూడాలని ఆయన అన్నారు. ఇందిరా గాంధీని ఖలిస్తాన్ పొట్టన పెట్టుకుందని, రాజీవ్ గాంధీని ఎల్టిటీఇ చంపిందని, సమైక్యాంధ్ర ఉద్యమం సోనియా గాంధీకి అదే గతి పట్టిస్తుందని పయ్యావుల కేశవ్ అన్నాడని ఆయన గుర్తు చేశారు. మానవబాంబులం అవుతామని గతంలో అన్నాడని ఆయన గుర్తు చేశారు. అంటే ఉగ్రవాదులుగా మారిపోయి సోనియా గాంధీని చంపుతారా అని ఆయన అడిగారు.
చంపుతామనే వాళ్లు ఉగ్రవాదులా, ఆత్మబలిదానాలు చేసుకున్న తెలంగాణ యువకులు ఉగ్రవాదులా అని హరీష్ రావు ప్రశ్నించారు. సీమాంధ్ర నాయకులు సహనాన్ని, విజ్ఝతను కోల్పోయారి ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని, అందుకు సీమాంధ్ర నాయకులు సహకరించాలని ఆయన అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అనవసరమైన విద్వేషాలు, అపోహలు కల్పించవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications