విభజిస్తే మూడు, యుటిగా హైదరాబాద్: కిశోర్ చంద్రదేవ్

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సలే కారణమని ఆయన ఆరోపించారు. వీరిద్దరి స్వార్థం వల్లే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలని బొత్స సత్యనారాయణ కలలు కంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే 2014వరకు తానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆశపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ అంశాన్ని సాగదీస్తూ వచ్చారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులకు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ పదవులు అప్పగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలో అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరగాలంటే, రాష్ట్రంలో శాంతి పరిస్థితులు నెలకొనాలంటే రాష్ట్రాన్ని మూడుగా విభజించడమే సరైన పరిష్కారమని కిశోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో నివసించే ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కొత్త రాష్ట్రాలకు సంబంధించిన ప్యాకేజీని, రాజధానులపైనా సరైన నిర్ణయాలను తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా ఆయన తప్పు పట్టారు. కెసిఆర్ ప్రకటన వల్ల ఇరు ప్రాంతాల్లో అభద్రతా భావం చోటు చేసుకుందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సలకు చెప్పే సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications