హైదరాబాద్‌ను గంపగుత్తగా ఎలా ఇస్తారు: విజయమ్మ
గన్నవరం: హైదరాబాదును గంపగుత్తగా తెలంగాణకు ఎలా ఇస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రశ్నించారు. గుంటూరు ఆస్పత్రిలో నిరాహారదీక్షను విరమించిన తర్వాత ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్ వస్తూ గన్నవరం విమానాశ్రంయంలో కాసేపు ఆగారు. ఇక్కడ ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాదు నుంచి 40 నుంచి 50 శాతం ఆదాయం వస్తోందని, హైదరాబాదును తెలంగాణకు ఇస్తే సీమాంధ్ర సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ఆమె అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఇస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయమని ఆమె అడిగారు.
అధికార బలంతో తన దీక్షను భగ్నం చేశారని ఆమె ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా ప్రేమించారని, మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని ఆమె అన్నారు. వైయస్ వారసుడిగా జగన్ అదే పని చేస్తారని ఆమె చెప్పారు. విభజన చేయాలనుకుంటే ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా అన్ని ప్రాంతాలకు తండ్రిలా సమన్యాయం చేయాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు.

అడ్గగోలుగా రాష్ట్రాన్ని విభజించడం సరి కాదని, న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పు నీళ్లు తప్పితే మంచినీళ్లు ఎలా లభిస్తాయని ఆమె అడిగారు. కలిసి ఉంటేనే కృష్ణా డెల్టాకు నీరు వచ్చే పరిస్థితి లేదని, నారాయణపూర్, అల్మట్టిల నుంచి వదిలితేనే నీరు వస్తోందని, రాష్ట్రాన్ని విభజిస్తే నాగార్జునసాగర్‌కు, శ్రీశైలం ప్రాజెక్టుకు, పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయో చెప్పాలని ఆమె అన్నారు. ఉద్యోగులకు భద్రత ఎలా కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య విభజన చిచ్చుపెట్టారని ఆమె ఆరోపించారు.
ఉద్వేగానికి గురైన విజయమ్మ
జగన్ రేపటి నుంచి తలపెట్టిన దీక్ష గురించి మాట్లాడే సమయంలో ఆమె కాస్తా ఉద్వేగానికి గురయ్యారు. ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని జగన్ తనను కోరాడని, నువ్వు దీక్ష చేయనంటేనే నేను విరమిస్తానని చెప్పానని, అయితే రేపటి నుంచి దీక్ష చేయడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని ఆమె అన్నారు. విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి జగన్ కలత చెందుతున్నాడని, అన్నదమ్ముల్లా ఉన్న ప్రజలను విడదీస్తున్నారని బాధపడ్డాడని ఆమె చెప్పారు.
తన కుమారుడు జగన్‌ను ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఆ తర్వాత దేవుడున్నాడు, ప్రజలున్నారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి వల్లనే కాంగ్రెసు సులభంగా విభజన నిర్ణయం తీసుకోగలిగిందని ఆమె విమర్శించారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం ప్రజల ముందుకు రావాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications