వైయస్ విజయమ్మ దీక్ష భగ్నం: సీమాంధ్ర బంద్
గుంటూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు నన్నపనేని రాజకుమారి, యరపతినేని శ్రీనివాసరావు దీక్షలను కూడా పోలీసులు భగ్నం చేశారు. దీక్షలను భగ్నం చేసినందుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శనివారం సీమాంధ్ర బంద్‌కు, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి.
వైయస్ విజయమ్మ దీక్షను భగ్నం చేయడానికి వచ్చిన పోలీసులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయమ్మను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పోలీసులు విజయమ్మకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు రక్తంపోటు పెరుగుతుండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టి విజయమ్మను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరికి నిరసనగా విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 20 నిమిషాలకు ఆమెను ఐసియులోకి తరలించారు.
ఆస్పత్రిలో కూడా విజయమ్మ దీక్షను కొనసాగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఐవి ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు కూడా ఆమె అంగీకరించడం లేదని ఆమె చెప్పారు. విజయమ్మను అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆమె తెలిపారు. బంద్‌కు అందరూ సహకరించాలని ఆమె కోరారు. ప్రజలు అధికార కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications