టీ ప్రక్రియ వేగం: సీమాంధ్ర మంత్రుల కింకర్తవ్యం?

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. ఆలస్యం చేసే కొద్దీ కొత్త సమస్యలను తలెత్తే అవకాశాలున్నట్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో ఆందోళనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో, సీమాంధ్ర నాయకులు కూడా సమైక్యనినాదాన్ని అందుకుంటుండడంతో తెలంగాణలో కూడా పరిస్థితి మారే ప్రమాదం ఉందని అధిష్టానం పసిగట్టినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉంది. తెలంగాణలో కూడా ఆందోళనలు ప్రారంభమైతే పరిస్థితి విషమిస్తుందని అనుకుంటున్నారు. హరీష్ రావులాంటి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తెలంగాణలో వేడి పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలపై గానీ సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తులపై గానీ దాడులు జరగలేదు. దాన్ని కాంగ్రెసు అధిష్టానం సానుకూలాంశంగా భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జాప్యం చేస్తే తెలంగాణ ప్రజల్లో అనుమానాలు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజల్లో అనుమానాలను పెంచి పోషిచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పరిస్థితులు చేయి దాటకుండా చూడాలని ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆమె తొలిసారి నోరు విప్పారు. అవసరమైతే ప్రభుత్వం తరఫున కమిటీ వేస్తామని అన్నారు. విభజన వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల సమస్యలను వినడానికి మాత్రమే ఆ కమిటీ వేస్తామని ఆమె చెప్పారు. అయితే, కమిటీని కచ్చితంగా వేస్తామని కూడా చెప్పలేదు. అవసరమైతే మాత్రమే వేస్తామని చెప్పారు.

తెలంగాణపై తీసుకున్న నిర్ణయంలో వెనకడుగు లేదనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. తనను కలుస్తున్న సీమాంధ్ర మంత్రులతో కూడా ఆ విషయాన్ని ఆమె కచ్చితంగా చెబుతున్నట్లు సమాచారం. శుక్రవారం తనను కలిసిన చిరంజీవితో కూడా అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. విభజన వల్ల సీమాంధ్రకు జరిగే నష్టాలు ఏమైనా ఉంటే, వాటిని ఆంటోనీ కమిటీకి నివేదించాలని, వాటిని పరిశీలిస్తామని ఆమె చెబుతున్నారు.

తెలంగాణపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం వెనక్కి పోదనే విషయం సీమాంధ్ర కేంద్ర మంత్రులకే కాదు, పార్లమెంటు సభ్యులకు, రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, నాయకులకు స్పష్టంగా తెలిసిపోయింది. అయితే, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆందోళనల నేపథ్యంలో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో రాజకీయంగా తమ పలుకుబడి దెబ్బ తినకుండా చాలా మంది కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు జాగ్రత్త పడడంలో భాగంగానే సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తున్నారనే విమర్స ఉంది.

Chiranjeevi

హైదరాబాద్, నదీ జలాలే..

అయితే, హైదరాబాద్ విషయంలో, నదీ జలాల పంపకం విషయంలో మాత్రం సాధ్యమైనంత వరకు పట్టుబట్టాలనే ఉద్దేశంతో సీమాంధ్ర నాయకులు ఉన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్ దాదాపు సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా వినిపిస్తున్నారు. నదీ జలాల విషయంలో రాయలసీమ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ దాదాపుగా మిగులు జలాల మీద ఆధారపడి నిర్మించినవే. వాటికి నికర జలాల కేటాయింపు లేదు.

అదే సమయంలో తెలంగాణకు కేటాయించిన నికర జలాలు పూర్తి స్థాయిలో తెలంగాణకు అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ ప్రాంతానికి నీరు రాకపోవచ్చుననే ఆందోళన నెలకొని ఉంది. ప్రాజెక్టులన్నింటిపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నియంత్రణ బోర్డులు వస్తాయి. దీని వల్ల కృష్ణా జలాలు తమ ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి రాయలసీమకు సాధ్యం కాదు. అదే సమయంలో ఎగువ ప్రాంతాలకు దక్కకుండా నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదు. కేటాయింపుల ప్రకారం, ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి ఆయా రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సహజంగానే కృష్ణా డెల్టాకు మునుపటిలా నీరు అందే పరిస్థితి లేదు.

తమ ప్రాంతాన్ని ఎండగట్టి రాయలసీమ, కృష్ణా డెల్టా నీళ్లు వాడుకుంటున్నాయని, గోదావరి జలాల వాడకానికి తెలంగాణకు అవకాశం కల్పించే ప్రాజెక్టులను నిర్మించడం లేదని, రాజోలీబండ వంటి ప్రాజెక్టుల ద్వారా కూడా తమ ప్రాంతానికి దక్కాల్సిన నీరు అందడం లేదని తెలంగాణవాదులు అంటున్నారు. నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు ఇదే అత్యంత కీలకమైన విషయం.

సీమాంద్ర కేంద్ర మంత్రులపై ఒత్తిడి

ఈ స్థితిలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రక్రియపై ఏం చేస్తారనే ఆసక్తి నెలకొని ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ నోట్‌ను ఆమోదించడానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మంత్రి వర్గ సమావేశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. నిజానికి, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కావూరి సాంబశివరావు, చిరంజీవి తదితర కేంద్ర మంత్రులు అనుకున్నారు. కానీ, రాష్ట్ర విభజనకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుండడంతో తమ మాటలను మార్చారు.

తెలంగాణ ప్రక్రియను ఆపలేమనే నిర్ణయానికి వచ్చినప్పటికీ సీమాంధ్ర కేంద్ర మంత్రులు తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని ప్రకటించుకోవాల్సిన అనివార్యతలో పడినట్లు కనిపిస్తున్నారు. పదవులకు రాజీనామాలు చేయాలని కూడా వారిపై ఒత్తిడి పెరుగుతోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పెడుతున్న ఒత్తిడికి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏం చేయాలనే విషయంపై వారు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. శనివారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోయారు.

సోమవారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఆహారభద్రత బిల్లు వంటి ప్రధానమైన అంశాలు సోమవారం నుంచి పార్లమెంటు ముందుకు రానున్నాయి. ఆహార భద్రత బిల్లును కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆహార భద్రత బిల్లు విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఉత్కంఠగానే ఉంది.

రాయపాటి సాంబశివ రావు వంటి కొద్ది మంది సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, అతివాదులు కేంద్ర మంత్రుల మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఏడుగురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సహకరిస్తారని ఎఐసిసి నాయకుడొకరు శనివారం చెప్పారు.

బిజెపికీ ప్రమాదం..

బిజెపి కూడా తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజల అనుమానాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో తెలుగుదేశం సభ్యులకు అనుకూలంగా బిజెపి వ్యవహరిస్తోందని, వీలు చిక్కితే తెలంగాణను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిందని విమర్శలు వస్తున్నాయి. ఇది బిజెపికి నష్టం కలిగించే విషయమే. దీంతో బిజెపి జాతీయ నాయకులు కూడా తెలంగాణ ప్రక్రియలో వేగం పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించాలని బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కోరడంలోని ఆంతర్యం అదేనని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+