సోనియాకు అర్హత లేదు, పిఎం కీలుబొమ్మ: బాబు
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉందని, ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మగా మారారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబమని తప్ప సోనియా గాంధీకి ఏ విధమైన అర్హత లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పరిపాలన లేదని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆయన ఆరోపించారు. దేశంలో రాజకీయ అనిశ్చితి ఉందని ఆయన అన్నారు.
రూపాయి విలువ పూర్తిగా పడిపోయిందని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణల్లో మంత్రులు రాజీనామా చేసినా ప్రధాని చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ అసమర్థుడిగా మారారని ఆయన అన్నారు. యుపిఎ పాలనకు పక్షపాతం వచ్చిందని ఆయన అన్నారు. రిమోట్ కంట్రోల్‌తో సోనియా పాలన సాగిస్తోందని, ఆమె చేతిలో అవినీతి పెరిగిపోయిందని, దేశం భ్రష్టుపట్టిపోయిందని ఆయన అన్నారు.

పాలనను నియంత్రించలేకపోతే ప్రధాని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని అసమర్థత వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆయన అన్నారు. దేశాన్ని దోచుకుని విదేశాల్లో డబ్బులు దాచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోల్‌గేట్ వ్యవహారాన్ని, ఇతర కుంభకోణాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రధానికి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత లేదా, ఆ బాధ్యత లేకపోతే మన్మోహన్ సింగ్‌కు ప్రధానిగా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆయన అన్నారు ఆహార భద్రత బిల్లును తేవడానికి నాలుగున్నరేళ్లు ఎందుకు తీసుకున్నారని ఆయన అడిగారు. సమస్య ఒక చోట ఉంటే చికిత్స మరో చోట చేస్తున్నారని ఆయన అన్నారు. దేశం ముందుకు సాగాల్సిన స్థితిలో పతనమయ్యే స్థితికి చేరుకుందని ఆయన అన్నారు.
బియ్యం చౌకగా ఇచ్చి మిగతా సరుకుల ధరలు పెంచారని ఆయన అన్నారు. దేశ అర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 389 ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేశారని, వాటి వల్ల ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. స్వదేశీ పరిజ్ఝానం ఉన్నా 85 శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన అన్నారు. ఫైళ్లు ఎలా మాయమవుతాయని ఆయన అడిగారు. గల్లంతయిన ఫైళ్లను వెతుకుతున్నామని ప్రధాని చెప్పడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఎగుమతులను, దిగుమతులను నియంత్రిస్తూ స్వయం సమృద్ధితో ముందుకు పోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
