షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా: వైయస్ విజయమ్మ
తిరుపతి: తమ కూతురు షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా, అక్కున చేర్చుకుని, ఆశీర్వదించండని వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రజలను కోరారు. షర్మిల సమైక్య శంఖారావం ప్రారంభ సభలో ఆమె సోమవారం సాయంత్రం ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో అన్యాయం చేస్తుంటే షర్మిలను తన కుమారుడు, తన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజలకు వద్దకు పంపించాడని ఆమె చెప్పారు. విభజన వల్ల జరిగే కష్టనష్టాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పాడని, అందుకే షర్మిల యాత్ర చేపడుతున్నారని ఆమె అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తూ సిడబ్ల్యుసి, యుపిఎ తీసుకున్న నిర్ణయం మారదని చెబుతుంటే బాధగా ఉందని విజయమ్మ చెప్పారు. సచివాయలయంలో, విద్యుత్ సౌధాలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో రెండు ప్రాంతాలవారిని విభజన నిర్ణయం చీల్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాలవారి మధ్య స్నేహం, ప్రేమ లేకుండా పోయిందని ఆమె అన్నారు. సీమాంధ్రలో ఉద్యోగులు పనిచేయడం లేదని, విద్యాసంస్థలు పనిచేయడం లేదని ఆమె అన్నారు.

ఓట్ల కోసం, సీట్ల కోసం విభజన నిర్ణయాన్ని అడ్డగోలుగా తీసుకున్నారని, జగన్‌ను దెబ్బ తీయాలని ఆ నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. విభజనకు షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆమె అన్నారు. మూడు ప్రాంతాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా వైయస్ పనిచేశారని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు విద్యుత్తు ఇచ్చాడని, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాడని ఆమె అన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేశాడని ఆమె చెప్పారు.
వైయస్ వారసత్వాన్ని తీసుకుని తమ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని ఆమె చెప్పారు. విభజనను వ్యతిరేకిస్తూ మొదట స్పందించింది తమ పార్టీయేనని ఆమె అన్నారు. అడ్డగోలుగా విభజన చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించామని, తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేశారని ఆమె అన్నారు. అధికారంతో తన దీక్షను, జగన్ దీక్షను భగ్నం చేశారని ఆమె విమర్శించారు. చూస్తూ ఊరుకుంటే భావి తరాలు క్షమించవని జగన్ షర్మిలను ప్రజల వద్దకు పంపించాడని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications