రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్దమైన వైసీపీ..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు ఘటన పై వైసీపీ మహిళా నేతలు ప్రభుత్వం పై మండిపడ్డారు. వైసీపీ మహిళా బృందం బాధితురాలిని కలిసి పరామర్శించింది. బాధితురాలికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా క్షీణించిందనే విషయాన్ని రుజువు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
గుంటూరులో మహిళపై జరిగిన దాడి, ఆమెను వివస్త్రను చేసిన ఘటన పైన వైసీపీ మహిళా నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఈ ఘటనపై సిగ్గుపడాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని, వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఈ ఘటన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చిందన్నారు.

ప్రభుత్వం పై వైసీపీ మహిళా నేతల ఆగ్రహం
మహిళలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మహిళలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. బాధిత మహిళకు తక్షణ న్యాయం చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. కావలి ఘటనలోనే ప్రభుత్వం కఠినంగా స్పందించి ఉంటే గుంటూరులో ఈ దారుణం జరిగేది కాదని.. మహిళలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications