క్యూర్ పరిధిలో వారికోసం కొత్త పథకం.. ఆగస్ట్ 10వరకే అప్లై చేసుకోండి!
హైదరాబాద్ లోని సొంతిల్లు లేని నిరుపేదలకు శుభవార్త. హైదరాబాద్ క్యూర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం నేడు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అర్హులైన అల్పాదాయ వర్గాలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట
ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్‌ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభించనుంది. క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ద్వారా నిరుపేదలైన వారికి గూడు అందించనున్నారు.

నిరుపేదలకు అండగా ఉండటం కోసమే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రాజెక్ట్
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉండటం కోసమే ఈ ప్రాజెక్ట్ ను చేపట్టిందని అన్నారు. ఈ పథకంలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి 4. 5 లక్షల ఇళ్ళను మంజూరు చేశామని, ఇవి ఆగస్ట్ నాటికి 2లక్షలకు పైగా పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ళను ఇవ్వనున్నామన్నారు.
పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్ళ నిర్మాణం: మంత్రి పొంగులేటి
అసలే స్థలం లేని నిరుపేదలకు క్యూర్ ప్రాంతంలో ఇల్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. పేదలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ధరలు విపరీతంగా ఉన్నా, కోట్ల రూపాయల ధర భూములు పలుకుతున్నా పేదల ఆత్మగౌరవం కోసం వెనకడుగు వేయకుండా ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి అన్నారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు అప్పటివరకే
ఇప్పటికే రాష్ట్రంలోని 26నియోజకవర్గాలలో 500ఇళ్ళను అపార్ట్ మెంట్ ల తరహాలో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఒక్కో ఫ్లాట్ 500చదరపు అడుగుల వైశాల్యంతో, అన్ని వసతులతో ఉంటుందని పేర్కొన్నారు. ఇక క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే వారు ఆగస్ట్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన కేంద్రాలలో, మీ సేవా కేంద్రాలలో ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు ఫారాలు నింపి సమర్పించాలని పేర్కొన్నారు.
ఈ పథకం పొందాలి అనుకునేవారు తెలుసుకోవాల్సినవి
అందులో ఇచ్చిన అన్ని వివరాలు పక్కాగా సమర్పిస్తే అర్హతను బట్టి ఇందిరమ్మ ఇళ్ళ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఏడాదికి ఆదాయం రూ. ఆరు లక్షలుగా ఉండి, సొంత ఇల్లు, స్థలం లేనివారు ఈ స్కీం కు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. మొత్తం ఇంటి నిర్మాణానికి 11లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, కాంట్రాక్టర్ కు ప్రభుత్వం 5లక్షలు ఇస్తుందని, మిగతా 6లక్షలు నాలుగు విడతల్లో లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications