సోనియా కాళ్లు పట్టుకునే స్థితి: జగన్‌పై చంద్రబాబు
గుంటూరు: మాట తప్పను...మడం తిప్పను అనే నినాదాలతో జనంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేడు బెయిల్ కోసం మాట తప్పి, మడం తిప్పి సోనియా గాంధీ కాళ్లు పట్టుకొనే స్థితికి వచ్చాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణాలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొని విజయం సాధించాలని సోనియా గాంధీ భావిస్తున్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను సోనియా గాంధీ రెండు చెప్పులుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇది ఎంతో దుర్మార్గమైన ఆలోచన అని, ఇటువంటి కాంగ్రెస్ దొంగలను ఉరితీయాలని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లు కూడా రావని భావించే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నింది, తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టిందని అన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, సోనియా ఆదేశాలను జైలులో ఉన్న జగన్ తూచా తప్ప కుండా పాటిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
సిడబ్ల్యుసి సమావేశానికి నాలుగు రోజులు ముందుగానే వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. సిడబ్ల్యుసిలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నది కల కన్నారా అని ప్రశ్నించారు. బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం తెలుగు జాతి పొట్ట కొట్టేందుకు ప్రయత్నించటం హేయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రలో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు పర్యటించారు. పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏడాదిన్నరగా జగన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారని, అయినా ఏమీ మారలేదని, అలాంటి దుర్మార్గులకు కనీసం మరణ శిక్ష వేయాలని, అప్పుడే మిగతావారు బయపడి తప్పు చేయకుండా ఉంటారని చంద్రబాబు అన్నారు.
ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేవని, అవినీతిని అరికట్టలేవని, ధరలను తగ్గించలేవని, ఫైళ్లను కాపాడుకోలేవని, నీకెందుకయ్య ప్రధాని పదవి అని, సోనియాకు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తూ ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేస్తూ వ్యక్తిత్వం లేకుండా వ్యవహరిస్తున్నావని ఆయన మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ పాలించే అవకాశం కాంగ్రెస్‌కు ప్రజలు కల్పించినప్పటికీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు ఏ మాత్రం పట్టించుకోకుండా సోనియా గాంధీకి పెంపుడు కుక్కల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముద్దపప్పు రాహుల్ గాంధీ
ముద్దపప్పు రాహుల్‌ను ప్రధాని చేయాలనే తపనతోనే తెలుగు జాతి మధ్య సోనియా చిచ్చు పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ఆమె కుట్రలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కుట్ర ఇప్పుడే ప్రారంభం కాలేదని, 1999లోనే ప్రారంభమైందని అన్నారు. తమ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారని, సోనియా గాంధీ ముగించారని దిగ్విజయ్ సింగ్ అన్నారని ఆయన గుర్తు చేశారు. మీకు చేత కాక పోతే నాకు వదిలి పెట్టి రాజీనామాలు చేసి వెళ్ళిపోండని, ఏడాదిలోపు ర్రాష్టాన్ని బాగు చేస్తానని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్‌పై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ భారత్‌లో తిరుగుతుంటే, భారత్ దేశంలో పుట్టిన తెలుగువాడైన శివప్రసాద్‌ను ఢిల్లీలో తిరగనివ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications