విభజన జరగకండానే ఆందోళన దేనికి?: సమ్మెపై హైకోర్టు

ఉద్యోగులు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండవచ్చునని, ఉత్తరాఖండ్ విభజన సందర్భంగా అదే జరిగిందని, సర్వీసు అంశాలు కాకుండా మరేదైనా ఉంటే చెప్పాలని, కృత్రిమ సమస్యలు సృష్టించడం సరికాదని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు సమ్మెను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ సేన్ గుప్త, జస్టిస్ కెసి భానులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఈ పిల్‌ను రవికుమార్ దాఖలు చేయగా, ఆయన తరఫున సత్యం రెడ్డి వాదించారు.
సుమారు నెల రోజుల నుంచి ఉద్యోగులు చేస్తున్న సమ్మెను నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టుకు తెలిపారు. సమ్మె వల్ల అనిశ్చితి నెలకొందని, విభజన ప్రకటన వచ్చిన వెంటనే ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇచ్చారని, రాజకీయ కారణాలపై సమ్మె చేయరాదని, అయినప్పటికీ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతుందని సత్యంరెడ్డి కోర్టుకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని వివరించారు. దీంతో శాంతిభద్రతలు, విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోకుండా మాత్రమే చూస్తున్నారా? సమ్మెను ఎందుకు నిరోధించడం లేదని బెంచ్ ప్రశ్నించింది.
అత్యవసర సర్వీసులు నిలిచిపోకుండా ఉండేందుకు ఎస్మా ప్రయోగించాలని అన్ని శాఖలకు అదేశాలు జారీచేసినట్లు నాయుడు తెలిపారు. జీవో 177 ప్రకారం నో వర్క్ నో పే అమలు చేస్తున్నామని, సమ్మెకాలానికి ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం లేదని చెప్పారు. ఉద్యోగులతో మంత్రులు ఇప్పటి వరకు రెండుసార్లు చర్చలు జరిపారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిల్‌ను కొట్టివేయాలని కోరారు.
ఈ వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎక్కడా సమ్మెను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు లేదని వ్యాఖ్యానించింది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఉద్దేశించి ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయని భావిస్తున్నారా? కేంద్రం ఏ చర్యలు తీసుకోబోతోందని అడిగింది.
విభజనపై కేంద్రం ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. ఉద్యోగుల సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందన్నారు. అలజడులను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే ఏం చేస్తారని బెంచ్ సూటిగా ప్రశ్నించింది. శాంతి భద్రతలపై గవర్నర్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన తెలిపారు. ఇదే అంశాన్ని అఫిడవిట్ రూపంలో వేయాలని కోర్టు సూచించింది.
అనంతరం ఎపిఎన్జీవోల తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వాదించారు. ఉద్యోగుల సమ్మెపై పిల్ దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని తెలిపారు. పిటిషనర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఇది రాజకీయ ప్రేరేపితమేగాని ప్రజాహితం కాదని, ఇది ప్రచారం కోసం వేసిన పిల్ అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కోర్టులకు 45 రోజుల పాటు తాళాలు వేశారని, న్యాయవాదిగా ఉన్న పిటిషనర్ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారని, పిటిషనర్ లేవనెత్తిన అంశాలు సత్యదూరంగా ఉన్నాయని, రాష్ట్ర విభజన అంశంతో పాటు సర్వీసు సబంధిత అంశాలపైనా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. విభజన జరిగితే రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉండవన్నారు. తెలంగాణ అంశంపై ఇక్కడి ఉద్యోగులు సమ్మె చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ప్రజాహిత వ్యాజ్యాల్లో పిటిషనర్‌కు వ్యక్తిగత ప్రయోజనాలు ఉండరాదని, పిటిషనర్‌కు నిజంగా ప్రజాహితమే ఉంటే తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసినపుడు ఎందుకు వ్యాజ్యం దాఖలు చేయలేదని, పిటిషనర్‌కు లోకస్‌స్టాండీ లేదని, ఇటువంటి పిల్స్‌ను ప్రోత్సహించరాదని మోహన్ రెడ్డి వాదించారు. అయితే, విభజనపై ఇంకా ప్రభుత్వ నిర్ణయం రాలేదన్నారు.












Click it and Unblock the Notifications