రాష్ట్ర ఏర్పాటు ఆగదు, పగటికలలు వద్దు: టీపై డిఎస్

రాష్ట్ర విభజన వల్ల కేవలం కొద్ది మంది ఉద్యోగులపై మాత్రమే ప్రభావం పడుతుందని, మిగతా వర్గాలపై ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల్లో నెలకొన్న అనుమానాలను, అపోహలను, భయాలను తొలగించడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. హోం శాఖ కార్యదర్శి తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులతో చర్చించి, సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. దేశంలోని అన్ని నగరాల వంటిదే హైదరాబాద్ నగరమని, ఇక్కడ ఎవరైనా ఉండవచ్చునని, ప్రభుత్వోద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలు చేసుకోవచ్చునని, స్థానికేతర కోటాలో ప్రభుత్వోద్యోగాలు కూడా పొందవచ్చునని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఉన్న సీమాంధ్ర ఉద్యోగులపై కూడా పెద్దగా ప్రభావం పడదని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కాబట్టి హైదరాబాదును వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిన అవసరం కూడా ఉండదని, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు వెళ్లిపోవాల్సి వస్తుందని తెలిసే చేరుతారని, దాంతో సమస్య లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు గురి కావడం సహజమని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల భయాల్లో వాస్తవమైనవి ఏమిటి, అపోహలు ఏమిటి అనేవి స్పష్టం చేయడానికి కేంద్రం చొరవ చూపాలని ఆయన కోరారు.
కాంగ్రెసుకు, యుపిఎకు, సోనియా గాంధీకి సీమాంధ్ర ప్రజలపై తక్కువ సానుభూతి ఏమీ లేదని, రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు కొత్త రాజధానికి కావాల్సిన ప్యాకేజీతో పాటు ఇతర ప్యాకేజీ గొప్పగా ఇస్తారని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు. ఉద్యోగులకు నష్టం జరగకుండా చూస్తారనే నమ్మకం కూడా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను సీమాంధ్రులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. తనకు రాష్ట్రంలోని అందరు నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని, తాను నాయకుల గురించి మాట్లాడబోనని ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.












Click it and Unblock the Notifications