అమెరికా జాబ్ వీసాలు ఇప్పిస్తానని టెక్కీ మోసం

సృజిత్ కుమార్ గుప్తా బిట్స్ పిలానీ గ్రాడ్యుయేట్. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హైదరాబాదులోని సోమాజిగుడాలో గల అతని మార్క్ ఓవర్సీస్ కన్సల్టెన్సీపై దాడి చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు సృజిత్ కుమార్ గుప్తాతో పాటు అతని అనుచరుడు ప్రవీణ్ బాబు (28)ను అరెస్టు చేశారు.
హైదరాబాదులోని గోల్నాకకు చెందిన ప్రవీణ్ బాధితులను వీసాలు ఇప్పిస్తామని నమ్మించాడని చెబుతున్నారు. వారిని నమ్మించిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, యుఎస్‌సిఐఎస్, ఎంబసీ ఫీజు వంటివాటికని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. తమ వీసా ప్రాసెస్ కోసం ఒక్కో వ్యక్తి 70 వేల రూపాయల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.
డబ్బులు తీసుకున్న తర్వాత వీసాల కోసం అడిగితే సరిగా సమాధానం చెప్పకపోవడం, వీసాల డెలివరీ తేదీలను వాయిదా వేయడం వంటి చర్యలు పాల్పడుతూ వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఇద్దరు 158 మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. నిందితుల నుంచి పోలీసులు 48.8 లక్షల రూపాయలను, స్కోడా రాపిడ్ కారును స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications