నెలాఖరులో టి తీర్మానం?: ముందుకెళ్లదని కిరణ్ ధీమా

 CM says he expects Assembly resolution by month end
హైదరాబాద్: ఈ నెలాఖరులోగా తెలంగాణపై తీర్మానం పెట్టవల్సిందిగా అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం నుండి సంకేతాలు రాగానే ఈ నెలాఖర్లో లేదా వచ్చే నెల(అక్టోబర్) మొదటి వారంలో తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తీర్మానాన్ని సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఓడించేందుకు సిద్ధమవుతున్నారు.

''విభజన అంశానికి సంబంధించి శాసన సభలో తీర్మానం వీగిపోతే ఈ ప్రక్రియ ముందుకు సాగదు. విభజనపై శాసన సభలో ఏకాభిప్రాయం కుదరకపోతే బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే పరిస్థితి ఉండకపోవచ్చు'' అని సీమాంధ్ర నేతల వద్ద ముఖ్యమంత్రి సందేహం వ్యక్తం చేశారట. గురువారం పలువురు సీమాంధ్ర ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు.

మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, విశ్వరూప్, శత్రుచర్ల విజయ రామరాజు, పార్థసారథి, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి, ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, రాజేశ్వరి, ముత్యాల పాప, వీరశివా రెడ్డి తదితరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య విభజన, తీర్మానం, కిరణ్ ఢిల్లా పర్యటన తదితర అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన వారికి ఢిల్లీ పరిణామాలను వివరించారు.

సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు అంతకంతకూ ఉద్ధృతమవుతున్నాయే తప్పితే ఎక్కడా తగ్గడం లేదని సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రాజీనామాలు చేయాలంటూ తమపై ఆందోళనకారుల నుంచి ఒత్తిడి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. దీంతో, శాసన సభలో విభజనకు సంబంధించి చర్చ జరిగి తీర్మానం వీగిపోయేంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కిరణ్ వారికి సూచించారట.

అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిష్ప్రయోజనమేనని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత విభజన ప్రక్రియ 2014 ఎన్నికల్లోగా జరిగే అవకాశాలే కన్పించడం లేదని కిరణ్ ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సిడబ్ల్యూసి తీర్మానం జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ కేబినెట్ నోట్‌తో సహా ఇతర ప్రక్రియలేవీ ముందుకు సాగలేదని, విభజన నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఆంటోనీ కమిటీ సహా అధిష్ఠానం పెద్దలు తికమకలో ఉన్నారని చెప్పారట.

అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా కేంద్రం ముందుకు సాగితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని కిరణ్ వారితో చెప్పారట. విభజనకు ఆస్కారం లేదని, అప్పటి వరకు సంయమనం పాటించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అధిష్టానం తీర్మానం కోసం ఆదేశాలిస్తుందా అని కూడా కొందరు సంశయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+