ప్రతికారదాడి: ఈటెల, పోలీసుపై హత్యాయత్నం: హరీష్

వారికి కావాల్సింది ఇక్కడి భూములు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు మాత్రమేనని, తెలంగాణ ప్రజల మనోభావాలు అక్కర్లేదని, దోచుకున్న సంపదపైనే వారికి ప్రేమ ఉందని అర్థమైపోయిందని మండిపడ్డారు. సమైక్యాంధ్ర సభా వేదిక వద్ద జై తెలంగాణ అని నినదించిన పోలీస్ కానిస్టేబుల్ విషయంలో సీమాంధ్రులు దుర్మార్గంగా, దౌర్జన్యంగా, పాశవికంగా వ్యవహరించిన తీరుతో వారి వైఖరి ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు.
అతనిని గొడ్డును బాదినట్టు బాదారని, ఆ కానిస్టేబుల్‌పై ఎవరు చేయి చేసుకున్నారో.. టివి చానళ్లలో ప్రసారమైందని, డిజిపి దినేష్ రెడ్డి సమ న్యాయం పాటిస్తే చట్టానికి లోబడితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. దాడులు చేయటం తెలంగాణ సంస్కృతి కాదని, సభ సమయంలో హింస వద్దనే ఉద్దేశంతోనే తాము బంద్ పాటించామని, ఉద్యోగుల ముసుగులో సీమాంధ్ర గూండాలు హైదరాబాద్ వస్తున్నారని తాము చెప్పినట్టే వచ్చారన్నారు.
నిజాం కళాశాలపై, తెలంగాణవాదులపై దాడులకు తెగబడ్డారన్నారు. వాళ్లూ, పోలీసులు కలిసి తెలంగాణ ప్రజల రక్తం కళ్ల చూశారని, దాడులతో తమ గుండెలు రగులుతున్నాయని, తెలంగాణ ప్రాంతం సీమాంధ్రుల తాత జాగీరు కాదన్నారు. వారిని ప్రభుత్వం శిక్షించకుంటే, ఇక్కడి ప్రజలే శిక్షిస్తారని హెచ్చరించారు. కేశినేని, దివాకర్, ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సుల వల్లనే ఆర్టీసి దివాళా తీస్తోందని, సీమాంధ్ర ప్రాంతం వారే ఒక్క నంబర్‌పై 20 బస్సులను నడుపుతూ ఆర్టీసీకి నష్టం కలిగిస్తున్నారన్నారు.
సమైక్యాంధ్ర సభకు వచ్చిన వారికి పోలీస్ ఎస్కార్ట్‌తో రాచ మర్యాదలు చేయటం ఏమిటని ఈటెల మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెలపై గుద్దినట్టు సభ పెట్టారని, ఇరు ప్రాంతాలు కలిసి మెలిసి బతికే వాతావరణాన్ని చెడగొట్టారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి శాశ్వత శత్రుత్వానికి ఎపిఎన్జీవోలు, ముఖ్యమంత్రి కారణమయ్యారని ఆరోపించారు. ఈ సభ తమను చైతన్యపర్చిందని, తెలంగాణ ఉద్యమాన్ని మరింత పదునుతో ముందుకు తీసుకెళ్లే స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
మద్రాసు నుంచి గెట్‌లాస్ట్ అంటూ సీమాంధ్రులను తరిమికొట్టారని, ఇప్పుడు కూడా వారు తెలంగాణ ప్రజలు అందిస్తున్న స్నేహహస్తాన్ని అందుకొని విభజనకు సహకరించటంలేదని, ఈ మేరకు హైదరాబాద్ నుంచి వారిని గెట్‌లాస్ట్ అని హెచ్చరించే రోజు వస్తుందన్నారు. అందుకు సమైక్యాంధ్ర సభనే పునాది వేసిందన్నారు. కానిస్టేబుల్ పైన హత్యాయత్నం: సైఫాబాద్ పోఎస్‌లో ఫిర్యాదు
ఎల్బీ స్టేడియంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పైన హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు, కాంగ్రెసు ఎమ్మెల్యే ముత్యం రెడ్డిలు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ సమైక్య సభ వేదిక సమీపంలో జై తెలంగాణ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న ఇతర కానిస్టేబుళ్లు, సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఆయనను వేదిక కిందకు తీసుకెళ్లి దాడి చేశారని, అడ్డుకోబోయిన మరో కానిస్టేబుల్ శ్రీశైలంను కొట్టారని హరీష్ రావు పేర్కొన్నారు.
ఈ విషయంలో ఉన్నతస్థాయి పోలీసు అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తీరుపై ఎంపి వివేక్, ఈటెల రాజేందర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. కాగా, ఎపిఎన్జీవోల సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ది మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామమని, ఎఆర్ సబ్‌డివిజన్ సిద్ధిపేటలో పని చేస్తున్నాడని, గతంలో ఎమ్మెల్యే ముత్యం రెడ్డి గన్‌మెన్‌గా పని చేశాడని హరీష్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications