హతవిధీ... మేకల కాపరిగా మారిన అదిలాబాద్ జిల్లా కామాగిరి సర్పంచ్; కారణం ఇదేనట!!
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా తయారవుతుంది. ప్రభుత్వ పట్టింపులేనితనంతో సర్పంచ్ లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సర్పంచ్ లు ఉపాధిహామీ కూలీలుగా పనిచేస్తూ కుటుంబ పోషణ కోసం నానా తిప్పలు పడుతుంటే, తాజాగా మరో సర్పంచ్ మేకల కాపరిగా మారిన పరిస్థితి సర్పంచ్ ల దయనీయ స్థితికి అద్దం పడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేయాలని సంకల్పించిన సర్పంచ్ లు చాలామంది తమ సొంత నిధులను అభివృద్ధి పనులకు కేటాయించటమే కాకుండా, బయటనుండి అప్పులు తెచ్చి మరీ గ్రామాలలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఇక ఆ డబ్బులు ప్రభుత్వం నుండి మంజూరు కాకపోవడంతో ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్ తొడసం భీమ్ రావు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

ఆదివాసి దివ్యాంగుడు అయిన భీమ్ రావు కామాగిరి నుండి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అప్పులు తెచ్చి మరీ గ్రామ అభివృద్ధి పనులకు ఆ నిధులను వెచ్చించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఆ అప్పులు తీర్చడం కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. పంచాయతీకి వస్తున్న అరకొర నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్ విధులకు సరిపోవడం లేదని ఆయన చెబుతున్నారు.
గ్రామాభివృద్ధి కోసం పది లక్షల వరకు అప్పు చేశామని, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతూ ఉండటంతో తాను ఇబ్బందులు పడుతున్నానని చెప్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో విధిలేని పరిస్థితిలో రోజుకు రెండు వందల రూపాయలు కూలి కోసం తాను మేకల కాపరిగా మారానని చెబుతున్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్న తనను, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే తరహాలో కూలీలుగా మారుతున్న అనేక మంది సర్పంచ్ లు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications