ఢిల్లీ వేదికగా ఆంధ్రులు ఏకాకులు కాదని అర్థమైంది: అమిత్ షా లేఖపై ఊగిపోయిన బాబు
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త ఎంపీలు శతృఘ్ను సిన్హా, ఇతర విపక్ష నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశం మొత్తం మనకు (ఏపీకి) అండగా నిలిచిందని చెప్పారు.

ఆంధ్రులు ఏకాకులు కాదని అర్థమైంది
రేపు తామంతా రాష్ట్రపతి వద్దకు వెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. 11 మంది ప్రతినిధులతో రాష్ట్రపతి వద్దకు వెళ్తున్నామని చెప్పారు. పాదయాత్రగా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకాకులు కారని మనకు ఢిల్లీ దీక్ష ద్వారా అర్థమైందని చెప్పారు. మోడీ అండ్ కంపెనీ తప్ప తన దీక్షకు అందరూ మద్దతిచ్చారని చెప్పారు. అయిదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యావాదాలు చెప్పారు.

మోడీని మించిన నటుడు లేడు
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని మించిన నటుడు ఎవరూ లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు మోడీకి పూర్తి మెజార్టీ ఇస్తే ఆయన ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాఫెల్ డీల్ విషయంలో మోడీ అనేక తప్పులు చేశారని చెప్పారు. వాటిని సరి చేసుకోవాలని తాము సూచించామని చెప్పారు. ప్రత్యేక హోదాకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రత్యేక హోదా సాధించి తీరుతామని అన్నారు.

మోడీకి భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రజాస్వామ్యమే మిగలదు
ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు హోదా కోసం పోరాడుతున్నాయని చంద్రబాబు చెప్పారు. మోడీకి గౌరవం ఇచ్చినా ఆయన నిలబెట్టుకోలేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మోడీకి భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రజాస్వామ్యమే మిగలదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెబుతూనే ఉన్నామని అన్నారు. ప్రత్యేక హోదాను ఆర్థిక సంఘంతో ముడిపెట్టారన్నారు.

మా హక్కుల కోసం పోరాడితే చెడ్డవాళ్ళమా
మా హక్కుల కోసం పోరాడితే మేం చెడ్డవాళ్లం అయ్యామా అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి కనీసం రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా అడుగడుగునా అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కంటే మెరుగైన ప్యాకేజీ అంటేనే తాము అంగీకరించామని చెప్పారు. కానీ ఏపీకి ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు హోదాను ఇచ్చారని చెప్పారు.

అమిత్ షా లేఖపై ఆగ్రహం
ఈ సందర్భంగా అమిత్ షా ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు లేఖ రాశారన్నారు. అమిత్ షా మళ్లీ అసత్యాలు చెబుతున్నారన్నారు. హామీలు నెరవేర్చని ప్రధానికి ఎందుకు స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేశారు కాబట్టే మీపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం, అమిత్ షా, మోడీలకు లేదన్నారు. రాఫెల్ కుంభకోణంపై సమాధానం లేదని చెప్పారు. వాస్తవాలు చెబుతున్న మీడియాపై పగబడుతున్నారన్నారు. శ్రీకాకుళం వెళ్తే అమిత్ షాకు ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయన్నారు.












Click it and Unblock the Notifications