ఏపీలో 'సర్వేల' ఫైట్: ట్యాబ్‌లలో ఎందుకు... జగన్ పార్టీ ఓట్లు లేకుండా చేసే ప్రయత్నమా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తొలగింపు అంశంపై మాటల యుద్ధం సాగుతోంది. ఈ మేరకు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విపక్షాల ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ కుట్రపూరిత సర్వే చేస్తోందనేది వైసీపీ ఆరోపణ. అలాంటి సర్వేలు తాము చేయడం లేదని, అసలు ఓట్ల తొలగింపు ఈసీ పరిధిలోనిది అని టీడీపీ వాదన.

ఓటర్ల జాబితా ట్యాబుల్లో ఎందుకు?
ఏపీలో పలు జిల్లాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కోసం కుట్ర సర్వే జరుగుతోందని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని బొత్స సత్యనారాయణ చెప్పారు. సర్వేల పేరుతో టీడీపీ నేతలు వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. ఓటర్ల జాబితాను ట్యాబుల్లో అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నెల్లిమర్లలో సర్వే చేసేందుకు వచ్చిన వ్యక్తులు తమ ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్పుకున్నారని అన్నారు. అనుమానం వచ్చిన వైసీపీ కార్యకర్తలు వారిని పట్టుకొని ట్యాబులను స్థానిక పోలీసులకు అప్పగించారని చెప్పారు. పోలీసులు కూడా వారిని వదిలేశారని ఆరోపించారు. ట్యాబులను తీసుకెళ్లి, ఫిర్యాదు చేసుకోమని చెప్పారన్నారు. రెండు ట్యాబులను ఈసీకి ఇచ్చామని తెలిపారు. సర్వే చేయడానికి వచ్చిన వారు ఏ పార్టీ వారు అనే విషయమై ఆరా తీయాలన్నారు.
బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలం

ఓటర్ల జాబితాలో వైసీపీ సానుభూతిపరులు లేకుండా ప్లాన్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధనబలంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నారని వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ వద్ద జన బలం ఉందని చెప్పారు. వైసీపీ సానుభూతిపరులు ఓటరు జాబితాలో ఉండవద్దని చూస్తున్నారని ఆరోపించారు.

సర్వేల ద్వారా ట్యాబుల్లోని ఓట్ల తొలగింపు అసాధ్యం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది దివాళాకోరుతనం రాజకీయమని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ఓట్ల గల్లంతు ఆరోపణలు చేస్తోందన్నారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు అనేవి అవాస్తవ ఆరోపణలు అన్నారు. ఓట్ల తొలగింపు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందన్నారు. వైసీపీ నేతలు మూర్ఖంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. సర్వేల ద్వారా ట్యాబుల్లో ఓట్ల తొలగింపు అసాధ్యమని చెప్పారు. ఓటు లేని వారికి ఆన్ లైన్ ప్రక్రియ అందుబాటులో ఉందని చెప్పారు. ఓటు నమోదు చేసుకోవాలని పదేపదే చెబుతున్నా వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు.

ఓట్ల తొలగింపు సాధ్యం కాదు
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న కుమిలిలో ఓటర్ల జాబితాతో సర్వే నిర్వహిస్తున్న నలుగురిని వైసీపీ నేతలు పోలీసులకు అప్పగించిన అంశంపై టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పందించారు. వైసీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అన్నారు. ఇదంతా ఈసీ పరిధిలో ఉంటుందన్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు ఇష్టానుసారం ఓట్లను తొలగించడం సాధ్యం కాదన్నారు. అవసరమైతే ఈ విషయంలో విచారణ జరపాలన్నారు. వైసీసీలో నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.
ఏపీలో టీడీపీ ఎలాంటి సర్వేలు చేయించడం లేదన్నారు.