కాల్‌మనీ సెక్స్ రాకెట్, టీడీపీ నేతలపై రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశా.. ఎందుకంటే: జీవీఎల్
అమరావతి/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేతలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు చేసే తప్పుడు పనులను ఏ విధంగా అడ్డుకోవాలో తమకు తెలుసునని చెప్పారు.
తనపై పిచ్చిగా మాట్లాడిన వారిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశానని జీవీఎల్ నర్సింహా రావు చెప్పారు. 2014కు ముందు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాచారని తెలిపారు. యూటర్న్ ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కరు చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
సెక్స్ రాకెట్, అధికార దుర్వినియోగం
ఈ మేరకు జీవీఎల్ నర్సింహా రావు ట్వీట్ కూడా చేశారు. తాను రాజ్‌నాథ్ సింగ్‌ను వ్యక్తిగతంగా కలిసి టీడీపీ నేతల క్రిమినల్ బిహేవియర్ పైన ఫిర్యాదు చేశానని, ముఖ్యంగా కాల్ మనీ - సెక్స్ రాకెట్, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుద్ధా వెంకన్న పైన కూడా ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం చేయడంపై ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఉత్తుత్తి కంప్లయింట్
కాగా, జీవీఎల్ నర్సింహా రావుపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీనిపై జీవీఎల్ స్పందించారు. 'మా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన చంద్రబాబు గారికి సభ ఉల్లంఘన హక్కుల నోటీసు ఇవ్వాలని ఈ రోజు ఉదయం మాణిక్యాలరావు గారు అసెంబ్లీ సెక్రటేరియట్ ను సంప్రతించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ముందుగ నాపై 'ఉత్తిత్తి' కంప్లైంట్ చేసి తమ భయాన్ని చాటి చెప్పారు. ఇది చవకబారు ప్రయత్నం మాత్రమే!' అని ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా 'సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే "పిచ్చి పీక్స్" కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం "అసెంబ్లీ రౌడీ" లాగా ప్రవర్తించారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన.' అని ట్వీట్ చేశారు.

జీవీఎల్ పైన బుద్ధా వెంకన్న ఆగ్రహం
జీవీఎల్‌కు దేహశుద్ధి తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం హెచ్చరించారు. జీవీఎల్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. జీవీఎల్ పిచ్చోడని, ప్రధాని మోడీ పిచ్చోడు చేతికి రాయి ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించడానికే జీవీఎల్‌కు ఎంపీ పదవి ఇచ్చారన్నారు. మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌నే పిచ్చోళ్లు ఉన్నారని అనుకున్నామని, ఇప్పుడు బీజేపీలో కూడా ఉన్నారన్నారు. జీవీఎల్‌ను బెదిరించడానికో లేక హెచ్చరించడానికో కాదని, నోటీకి హద్దు పద్దు ఉండాలని, బీజేపీ, వైసీపీ పార్టీలకు రోజులు దగ్గరపడ్డాయన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!