ఓ పక్క వివాదాలు.. మరో పక్క పార్టీలో భిన్న స్వరాలు..! బాబుకు సవాల్ గా మారనున్న ఎన్నికలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరుంది.విభజన తర్వాత ఏపీ మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు, వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించేదిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. టీడీపీ అదినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పార్టీలో అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుంటూనే, ఎన్నికల కసరత్తు గతానికంటే భిన్నంగా నడిపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలుకంటే ముందే మెజారిటీ అభ్యర్థులపై స్పష్టత ఇచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రతిసారీ చివరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగేది. నామినేషన్ల ప్రక్రియ ఆఖరు దశకు చేరుకున్నాక కూడా కొన్ని స్థానాలపై స్పష్టత వచ్చేది కాదు. కానీ ఈ సారి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బాబు.

పార్టీ లో అన్నీ తానై ముందుకెళ్తున్న బాబు..! గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీయం..!!
ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దాదాపు సగం స్థానాలపై స్పష్టత ఇచ్చేశారు చంద్రబాబు. అంతా బాగుందనుకున్న చోట సిట్టింగ్‌లు, ఇన్‌చార్జులను పనిచేసుకోవాలని చెప్పేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వర్గ తగాదాలు, సిట్టింగ్‌లపై తీవ్ర అసంతృప్తి ఉన్న స్థానాల్లో ఎంపికను వాయిదా వేయడంపైనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి స్థానాలపై చంద్రబాబు పార్టీ సీనియర్లతో కమిటీ వేసి విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేవారు.

కేంద్రంతో, తెలంగాణతో వివాదాలు..! అదిగమిస్తామంటున్న బాబు..!!
కానీ ఈసారి మాత్రం ‘అన్నీ తానై' అన్నట్లుగా మొత్తం వ్యవహారాలను చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, మ్యానిఫెస్టోలో పెట్టే అంశాలు, ప్రత్యర్థుల దాడిని తట్టుకునే మార్గాలు, ప్రభుత్వ పాలన అన్నీ స్వయంగా ఆయనే చూసుకుంటున్నారు. అసంతృప్తులను నేరుగా ఆయన ముందుకు తీసుకొచ్చినా అప్పటికప్పుడు రాజీ కుదర్చడానికి గంటల కొద్దీ సమయం వెచ్చించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు అది కుదరని పనిగా పరిణమించింది.

సొంత పార్టీ నేతల భిన్న స్వరాలు..! రోజురోజుకూ పెరుగుతున్న అసంత్రుప్తులు..!!
ఈ నేపథ్యంలో ఇలాంటి నియోజకవర్గాల వివాదాలను సర్దుబాటు చేసేందుకు కొందరు సీనియర్ నేతలను ఎంపికచేసి, ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిచోట్ల టికెట్ రేసులో ఇద్దరు, ముగ్గురు నేతలుండగా, సిట్టింగ్‌లు ఉన్న చోట అసమ్మతి ఉంది. రేసులో ఉన్న వారికి సర్దిచెప్పడం సులువుగా ఉన్నప్పటికీ, సిట్టింగ్‌లపై అసమ్మతి జ్వాలలు ఉన్న స్థానాల్లో మాత్రం పరిస్థితి క్లిష్టంగానే ఉంది. రెండు వర్గాలను సముదాయించి ముందుకెళ్తేనే పార్టీ విజయానికి భరోసా ఉంటుంది. అదీ కాకుండా కేంద్రంతో ద్వేషపూరిత వాతావరణం, తెలంగాణ రాష్ట్రంతో వివాదాలు బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంక్షేమపథకాతో ప్రజలకు దగ్గరవుతున్న బాబు..! ఎన్నికల్లో విజయం పై ధీమా..!!
ఐతే వివాదాలను అదిగమిస్తూనే సంక్షమ పథకాల తో ఏపి ప్రజానికానికి పార్టీని దగ్గదర చేయాలని బాబు ప్రణాళిక రిచిస్తున్నారు. అందులో భాగంగా పింఛన్లు రెట్టింపు చేయడం, పసుపు-కుంకుమ కింద రెండోసారి డ్వాక్రా మహిళలకు 10వేల రూపాయల చొప్పున ఇవ్వడం, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు సహాయం వంటి చర్యలతో క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఏ వర్గాన్నీ వదలకుండా అందరికీ లబ్ది చేకూరేలా బాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థులను ముచ్చెమటలు పెట్టిస్తున్నాయి. ఇక పార్టీ నేతల్లో అసంతృప్తులను తొలగిస్తూ బాబు వచ్చే ఎన్నికలకు సిద్దం కావడం చూసి ప్రత్యర్థి నేతలు అవాక్కవుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications