అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రచార రేసులో కమలనాథులు కూడా: 10న ప్రధాని రాక..

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలనే ప్రచార వేదికలుగా మార్చుకున్నారు. పసుపు-కుంకుమ అని, ధర్మ పోరాట దీక్ష అని ఇలా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బుధవారం తిరుపతి వేదికగా తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్టే. బూత్ కమిటీలు, మండల స్థాయి ఇన్ ఛార్జిలతో భేటీ అనంతరం జగన్.. బహిరంగ సభలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. జనసేన పార్టీ కూడా జిల్లా స్థాయి పర్యటనకు రెడీ అవుతోంది. ఇప్పటికి అయిదు జిల్లాలను చుట్టేసి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. మలిదఫా పర్యటనలకు సిద్ధమౌతున్నారు. ఇదీ ఓ రకంగా ఎన్నికల ప్రచారం లాంటిదే. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ.

సరిగ్గా అయిదేళ్ల కిందట ఇదే సమయానికి కమలనాథుల కాళ్లు భూమ్మీద లేవు. నేలకు ఓ అడుగు ఎత్తులో, గాల్లో తేలుతూ కనిపించారు. గెలుపు తమదేననే ధీమా ఇచ్చిన ధైర్యం అలాంటిది. ఓ వైపు చంద్రబాబు నాయుడు, ఇంకో వైపు పవన్ కల్యాణ్, పైన నరేంద్రమోడీ.. ఇలా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది బీజేపీ. నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తున్నారంటే రెండు వారాల ముందు నుంచే ప్రచార ఆర్భాటం నిండా కనిపించేది. మోడీ ఎక్కడ పాల్గొంటే అక్కడి ప్రాంతాలన్నీ కాషాయమయమైపోయేవి.

PM narendra modi will participate in public meeting organized by state bjp at guntur on 10th

అయిదేళ్లు తిరిగే సరికి కషాయ పార్టీకి పచ్చి కషాయం నోట్లో పోసుకున్నట్లు తయారైంది. చంద్రబాబు ఛీ కొడుతున్నారు.. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో వేరు కుంపటి పెట్టుకున్నారు. తాను చేసిన తప్పులన్నింటినీ చంద్రబాబు బీజేపీ మీద నెట్టేస్తున్నారు. అయిన దానికీ, కాని దానికీ కేంద్రానిదే తప్పంటూ అయిదు వేళ్లూ అటే చూపుతున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్, చంద్రబాబుకు అనుంగు మిత్రుడు వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. దీనితో ఆయనా చేయడానికేమీ లేకపోయింది. తమతో కలిసి వచ్చే వారే లేక బిత్తర చూపులు చూస్తున్నారు కమలనాథులు.

అయినప్పటికీ- పుంజుకోవడానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా.. నరేంద్రమోడీని రంగంలోకి దింపింది. ఈ నెల 10వ తేదీన గుంటూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు రాష్ట్ర బీజేపీ నాయకులు. గుంటూరే ఎందుకనడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి- అమరావతికి ఆనుకునే ఉండటం, రెండు- కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండటం, మూడు- బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్మ్షీనారాయణ సొంత జిల్లా కావటం.

ఈ దఫా తమ తొలి ఎన్నికల ప్రచార సభను నరేంద్రమోడీతోనే ప్రారంభిస్తే శకునం బాగుంటుందని అనుకున్నారో.. ఏమో గానీ ఏకంగా ఆయన్నే బరిలో దింపుతున్నారు. ప్రజా చైతన్య సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. దీనికి ముఖ్యఅతిథి నరేంద్రమోడీ. ఉదయం 10 గంటలకు సభ ఆరంభమౌతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

ఈ ప్రజా చైతన్య సభకు సత్యమేవ జయతే అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. బ్రాకెట్ వేసి మరీ సత్యమేవ జయతే అని ట్యాగ్ లైన్ పెట్టడం వెనుక పెద్ద కథే ఉన్నట్టుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, రాష్ట్రానికి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు, రోడ్ల నిర్మాణం, ఉత్తరాంధ్రలో మూడు, రాయలసీమలోని నాలుగు వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన మొత్తాల గురించి ఈ సభలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.

కేంద్రం భారీగా నిధులను ఇచ్చినప్పటికీ.. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, నిజం ఏమిటనేది వెల్లడించడానికే ఈ ట్యాగ్ లైన్ అని అంటున్నారు కమల నాథులు. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ పార్టీ శ్రేణులను గుంటూరుకు రప్పించనున్నారు. మోడీతో పాటు ఇంకా కేంద్రమంత్రులు ఎవరు వస్తారనేది ఇంకా తెలియ రావట్లేదు.

English summary
BJP star campaigner, Prime Minister of India Narendra Modi will come to Andhra Pradesh on 10th of this month. He will participate Praja Chaithanya Sabha at Guntur. BJP Andhra Pradesh leaders organize that public meeting. Some of the union minister likely to participate along with Narendra Modi says BJP State leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X