ఢిల్లీకి చేరిన తాడిపత్రి రాజకీయం..!!
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రాజకీయాలు అటు తిరిగి, ఇటు తిరిగి దేశ రాజధానికి చేరాయి. తాడిపత్రికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారంటూ ఆరోపిస్తోన్న తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసింది. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎస్సీలను అణచివేస్తోన్నారంటూ ఆరోపించింది.

డీఎస్పీపై ఫిర్యాదు..
అనంతపురం డీఎస్పీ చైతన్యపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యురో సభ్యుడు వర్ల రామయ్య ఈ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ నాయకులను ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశాలతో డీఎస్పీ చైతన్య ఉద్దేశపూరకంగా వేధిస్తోన్నారంటూ విమర్శించారు. అకారణంగా తమ పార్టీకి చెందిన దళితులపై అనంతపురం డీఎస్సీ చైతన్య కేసులు నమోదు చేస్తోన్నారని ధ్వజమెత్తారు.

చట్ట విరుద్ధంగా..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి విరుద్ధంగా కేసులు నమోదు చేస్తోన్నారని, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోన్నారని ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి దేశాలతో అమాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వారిని పోలీస్ స్టేషన్ల వెంట తిప్పుకొంటున్నారని వర్ల రామయ్య చెప్పారు. డీఎస్పీ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉందని, గతంలోనూ ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

డీజీపీకి లేఖ రాసినా..
డీఎస్పీకి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కొన్ని ప్రైవేటు కేసులు నమోయ్యాయని వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఇదివరకు కూడా డీఎస్పీ చైతన్య తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. డీఎస్పీని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ తాను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ సైతం రాశానని గుర్తు చేశారు. అయినప్పటికీ- ఆయనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలను తీసుకోలేదని చెప్పారు.

కమలమ్మపై కేసులా..
దళిత మహిళ కమలమ్మపై అక్రమంగా కేసులు నమోదు చేయడం డీఎస్పీ వ్యవహార శైలికి నిదర్శనమని వర్ల రామయ్య చెప్పారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విద్యార్హతల గురించి మాట్లాడినందుకు కమలమ్మపై కేసు పెట్టారని, నిజానికి- ఆమె అనంతపురం జిల్లా రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోండటం వల్లే వైఎస్ఆర్సీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

నోటీసులు ఇవ్వకుండా..
సామాజిక చైతన్యాన్ని కలిగి ఉన్న ఓ దళిత మహిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటాన్ని వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతోన్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 41 ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారని, పోలీసుల చర్యను న్యాయస్థానం కూడా తప్పుపట్టిందని వర్ల రామయ్య గుర్తు చేశారు.

కేసు పెట్టేలా..
చట్ట విరుద్దంగా వ్యవహరించినందున స్థానిక న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి నిరాకంచిందని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించకుండా, చట్టవిరుద్ధంగా విధులను నిర్వర్తిస్తోన్న అనంతపురం డీఎస్పీ చైతన్యపై చర్యలు తీసుకోవాలని ఆయన జాతీయ ఎస్సీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయనపై కేసు నమోదు చేసేలా డీజీపీకి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications