''మరో తెలుగుదేశం'' పార్టీని నడిపిస్తున్న ఆ ఇద్దరూ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ నాయకులు మారకపోతుండటంతో పార్టీ నష్టం కలుగుతోంది. ఈ జాబితాలో అనంతపురం జిల్లా చేరింది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లాలో మరో తెలుగుదేశం పార్టీని జేసీ సోదరుల ఆధ్వర్యంలో నడిపిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యలు వస్తున్నాయి.

తాడిపత్రి కౌన్సిల్ సభ్యులతో సమావేశం
చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది. అయితే సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దక్కించుకున్న ఒకే ఒక్క పురపాలక సంఘం తాడిపత్రి. అధినేత ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి హాజరు కాకపోవడంపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎవరినీ కలుపుకొని పోవడంలేదని, సొంతంగా వ్యవహరిస్తున్నారని, కనీసం పార్టీ కండువా కూడా భుజాన వేసుకోరని కౌన్సిల్ సభ్యులు వెల్లడించారు. ఒకరకంగా పార్టీ అంటే లెక్కలేనితనంగా భావిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

సొంత కార్యక్రమాల అమలు
పుట్టపర్తి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న రఘునాథరెడ్డికి అడ్డం పడుతున్నారని బాబు దృష్టికి తెచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరో ఐదు నియోజకవర్గాల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉంది. ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్నవారిని కాదని తాము చెప్పినవారికి ఇవ్వాలంటూ బాబుపై జేసీ సోదరులు ఒత్తిడి తెస్తున్నారు. వారి ఒత్తిడిని చంద్రబాబు సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి బదులుగా సొంత కార్యక్రమం అమలు చేస్తున్నారని వివరించారు.

నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్చండి..
సొంత పార్టీలోనే ఉంటూ, పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా ఉంటే తాము వారితో ఎలా వ్యవహరించాలని చంద్రబాబును ప్రశ్నించారు. పార్టీపై పూర్తిస్థాయిలో జేసీ సోదరులు దృష్టిసారించేలా చేయాలని, లేదంటే నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ ఛార్జిలను మార్చాలని కోరుతున్నారు. అయితే వారి విషయం తనకు వదిలివేయాలని, ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమం చేయాలని సూచించారు. చివరకు చంద్రబాబు తాను మారతారా? లేదంటే వారిని మారుస్తారా? అనేది తేలాల్సి ఉంది.