నారా లోకేష్ పాదయాత్ర వేళ- అనంతపురంలో జేసీ బ్రదర్స్ కొత్త స్క్రిప్ట్
అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 65వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటోన్నారు.
పాదయాత్రలో భాగంగా జిల్లా ప్రజలకు పలు హామీలను ఇస్తోన్నారు నారా లోకేష్. తాము అధికారంలోకి వస్తే- హంద్రీనీవా కింద మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం మిగులు జలాలను రాయలసీమకు తరలిస్తామని అన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగు నీరు మాత్రమే కాకుండా ఇంటింటికీ మంచి నీరు అందించే బాధ్యతను తాను తీసుకుంటానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తాడిపత్రికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా ఘాటు ఆరోపణలు చేశారు. ముదిగుబ్బలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే- వాటన్నింటినీ విడిపిస్తామని చెప్పారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేస్తోన్నారని, అయిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు.
ఈ విమర్శలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. అంతే ఘాటుగా నారా లోకేష్ ఆరోపణలను తిప్పి కొట్టారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ము, ధైర్యం నారా లోకేష్‌కు ఉందా? అని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి- రోజూ ఓ కొత్త స్క్రిప్ట్‌ను నారా లోకేష్‌కు అందిస్తోన్నారని, దాన్ని చదివి తమపై నిరాధార ఆరోపణలు చేస్తోన్నాడని మండిపడ్డారు.
ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రిలో తాను భూ ఆక్రమణలు చేశామంటూ జేసీ బ్రదర్స్ ఇచ్చే స్క్రిప్ట్‌ను చదవడం కాదని, చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీ బ్రదర్స్‌కు నారా లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.
గతంలో జేసీ బ్రదర్స్ అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నేతలు పోరాడారని, ఇప్పుడు ఆ కుటుంబానికి నారా లోకేష్ మద్దతు ఇవ్వడం హాస్యాస్పదమని చెప్పారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రను చంపించింది కూడా జేసీ బ్రదర్సేనని కేతిరెడ్డి ఆరోపించారు. పరిటాల రవీంద్రను హతమార్చడానికి మొద్దు శ్రీను ఉపయోగించిన మారణాయుధాన్ని ఎవరు సరఫరా చేశారనేది జిల్లా ప్రజలకు తెలుసునని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications