ఏపీలో కరోనా కల్లోలం: 2వేలకు చేరువలో కొత్త కేసులు, గుంటూరులో అత్యధికం, 5 జిల్లాల్లో 200కుపైగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 2వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా.. 1,941 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2వేలకు చేరువలో కరోనా కేసులు
తాజాగా నమోదైన 1,941 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,10,943కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,251కు చేరింది.

ఏపీలో భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 835 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,91,883కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,809 యాక్టివ్ కేసులున్నాయి.

ఐదు జిల్లాల్లో డబుల్ సెంచరీ దాటిన కొత్త కరోనా కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,52,70,771 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో కొత్తగా 424 కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఐదు జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 71, చిత్తూరులో 323, తూర్పుగోదావరిలో 27, గుంటూరులో 424, కడపలో 74, కృష్ణాలో 212, కర్నూలులో 86, నెల్లూరులో 231, ప్రకాశంలో 59, శ్రీకాకుళంలో 102, విశాఖపట్నంలో 258, విజయనగరంలో 49, పశ్చిమగోదావరిలో 25 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.