ఏపీలోని 16 స్కూళ్లలో అందరూ ఫెయిల్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత శాతం పెరగడం హర్షించదగ్గ పరిణామం. గతేడాది కంటే ఈసారి విద్యార్థుల ప్రతిభ మెరుగుపడిందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు మరియు బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కొన్ని పాఠశాలలు అత్యంత ఘోరమైన ఫలితాలను నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 87.90%తో బాలురను అధిగమించారు. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత 78.39%కి పెరిగింది. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాల్లో 96.07 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. అత్యల్పం అల్లూరు సీతారామరాజు జిల్లా 57.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 2161 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు వచ్చే 25 నుండి జూన్ 4 తేదీ వరకు సప్లమెంటరీ పరిక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, ప్రత్యేక తరగతుల నిర్వహణ ఈ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు 16 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ స్కూళ్ల నుండి ఒక్క విద్యార్థి కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులు కాలేకపోవడం విద్యాశాఖను కలవరపెడుతోంది. మరీ ముఖ్యంగా ఈ 16 పాఠశాలల్లో 11 ప్రైవేటు స్కూళ్లు ఉండటం సంచలనంగా మారింది. భారీగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు యాజమాన్యాలు, బోధన విషయంలో కనీస శ్రద్ధ చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వాటిలో రెండు ఆశ్రమ పాఠశాలలు, రెండు ఎయిడెడ్, ఒక ప్రభుత్వ బడి ఉన్నాయి.
ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా, ఈ లోపాలను సరిదిద్దుకుని తదుపరి పరీక్షల్లో విజయం సాధించాలని విద్యాశాఖ కోరుతోంది. సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం లేదా ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది. టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ.. మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు దయచేసి నిరాశ చెందవద్దు.. కుటుంబాలు, ఉపాధ్యాయులు, సమాజం యొక్క మద్దతుతో, మీరు మరింత బలంగా తిరిగి విజయం సాధించగలరంటూ సూచించారు.












Click it and Unblock the Notifications