గొంతులో అడ్డుపడ్డ మాంసం ముక్క: చిన్నారి మృతి
హైదరాబాద్: పుట్టిన రోజు నాడే ఓ చిన్నారి కన్నుమూసిన విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో జరిగింది. గ్రామానికి చెందిన మండపాక శ్రీను కుమార్తె ధనలక్ష్మీ (12). స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో ఆరో తరగతి చదువుతోంది.
ఆదివారం పుట్టినరోజు కావడంతో కొత్త దస్తులు వేసుకుని ఉదయం వీధిలో ఉన్న బంధువులు, స్నేహితులందరికీ చాక్లెట్‌లు పంచింది. అనంతరం మధ్యాహ్నం మాంసం కూరతో ఇంట్లో కుటుంబ సభ్యలతో కలిసి భోంచేస్తుండగా ధనలక్ష్మీ గొంతులో మాంసం ముక్క అడ్డు పడింది.

దీంతో ఆపర్మారక స్ధితిలోకి వెళ్లిన ఆమెను తొలుత స్ధానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది సేపటికే శ్వాస అందక ధనలక్ష్మీ మృతి చెందిందని చెబుతూ తండ్రి శ్రీను భోరున విలపించాడు. కూతుర్ని కోల్పోయిన తల్లి నాగమణి వేదన వర్ణనాతీతం. శ్రీనుకు ముగ్గురు ఆడపిల్లలో ధనలక్ష్మీ రెండో సంతానం.












Click it and Unblock the Notifications