ఆత్మకూరు బరిలో 14 మంది - 12 న జిల్లాకు సీఎం జగన్ : రోజా - కొడాలి నానికి బాధ్యతలు..!!
ఆత్మకూరు బై పోల్ నామినేషన్ల ఉప సంహరణ గుడువు ముగిసింది. పోటీలో మొత్తం 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ బీజేపీగా మారింది. ఇక్కడ గెలుపు కంటే మెజార్టీ వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇందు కోసం అభ్యర్ధిత్వం ఖరారు అయిన సమయం నుంచే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో తాను తప్పని స్థితిలో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు.

అక్కడ కంటే ఎక్కువ మెజార్టీ లక్ష్యంగా
గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. బీజేపీ తమ అభ్యర్ధిని రంగంలోకి దింపింది. భరత్ కుమార్ కు మద్దతు సోము వీర్రాజు ఎక్కువగా నెల్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న నెల్లూరు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుమారుడు వివాహ రిసిప్షెన్ జరగనుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తారని చెబుతున్నారు. దీని పైన అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇక, అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు.

రంగంలోకి ఫైర్ బ్రాండ్స్
వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మంత్రి రోజా.. మాజీ మంత్రి కొడాలి నాని కి చేజెర్ల మండల బాధ్యతలు అప్పగించారు. అక్కడ మెజార్టీ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సోమవారం నుంచి వారిద్దరూ ఇక్కడ ప్రచారం కోసం వస్తారని చెబుతున్నారు. బీజేపీ బరిలో ఉన్నా..టీడీపీ - జనసేన దూరంగానే ఉంది. ఇక, మండలాల వారీగా అనంతసాగరం మండలం- మంత్రి మేరుగ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి అప్పగించారు. ఎఎస్‌పేట మండలం- మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి బాధ్యతలు కేటాయించగా.. ఆత్మకూరు అర్బన్- మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు రూరల్- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి అప్పగించారు.

అసలు లక్ష్యం అదే..ఎన్నికల చర్చ వేళ
మర్రిపాడు- మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లు పర్యవేక్షిస్తున్నారు. ఇక, సంగం మండలం: మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కి కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్వేలు ఉప ఎన్నిక కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరు లో ఇప్పుడు విక్రమ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీనే ఎన్నికతో ప్రారంభం కావటంతో..ఎటువంటి ఫలితం వస్తుంది..ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications