Tirupati Laddu: కల్తీ వివాదంతో లడ్డూ డిమాండ్ పెరిగిందా? తగ్గిందా?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారైన లడ్డూల్లో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఇప్పటివరకూ దేశ విదేశాల్లో కోట్లాది మందికి ఆరాధ్య దేవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ అలాంటిది. లడ్డూ వివాదానికి ముందు పరిస్ధితి ఎలా ఉన్నా ఈ వివాదం తర్వాత లడ్డూల విక్రయాలు ఎలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై అలాంటి ఇబ్బంది లేదని, స్వచ్ఛమైన నెయ్యితోనే తాము లడ్డూలు చేయిస్తున్నామని క్లారిటీ ఇస్తోంది. దీంతో ప్రతిరోజూ దర్శనం కోసం వచ్చే 60 వేల మంది భక్తులు ఎప్పటిలాగే లడ్డూను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో లడ్డూ అమ్మకాలు సాధారణంగానే ఉన్నాయి.

తాజాగా కల్తీ నెయ్యి వివాదం తెరపైకి వచ్చాక నాలుగు రోజుల్లో 14 లక్షలకు పైగా తిరుపతి లడ్డూలు అమ్ముడుపోయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 19న మొత్తం 3.59 లక్షల లడ్డూలు, సెప్టెంబర్ 20న 3.17 లక్షలు, సెప్టెంబర్ 21న 3.67 లక్షలు, సెప్టెంబర్ 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు రోజువారీ సగటు 3.50 లక్షల లడ్డూలకు సమానంగా ఉన్నాయి. దీంతో కల్తీ నెయ్యి వివాదం లడ్డూల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications