వర్షాలు: జలవిలయంతో గుండెకోత, 17 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఫైలిన్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే వర్షాల రూపంలో ముప్పు ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తా జిల్లాలనే కాకుండా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని జిల్లాల్లో కూడా వర్షాలు ఊపేస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు, లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమ్యయాయి. సాధారణ జనజీవితం అస్తవ్యస్తంగా మారింది.

కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లు తెగిపోయాయి. రోడ్లపై, రైల్వే ట్రాక్స్‌పై నీరు చేరడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పరిస్థితి కన్నీరు తెప్పించే విధంగా ఉంది.
భారీ వర్షాలకు వివిధ సంఘటనల్లో ఇప్పటి వరకు 17 మంది మరణించినట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, హైదరాబాదులో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
లోతట్టు ప్రాంతాల నుంచి 67 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 135 పునరావాస కేంద్రాలకు వారిని తరలించారు. వేలాది మంది ప్రజలు గ్రామాల్లో నీటి మధ్య చిక్కుకుపోయారు. నీరు, తిండి లేక వారు అవస్థలు పడుతున్నారు.
వర్షాల వల్ల 3 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాలు నీటి మధ్య చిక్కుకుపోయాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, ఏలూరు నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వరద తాకిడి ప్రాంతాలకు జాతీయ విపత్తుల రెస్పాన్స్ ఫోర్స్ 9 బృందాలను పంపించింది. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు, గుంటూరు జిల్లాలో మూడు, నల్లగొండ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కటేసి బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాల్లో మునిగిపోయాయి.
వర్షాలకు 17 చెరువులు ధ్వంసమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిలో చాలా వరకు శ్రీకాకుళం జిల్లాలోనివే. ఆంధ్రప్రదేశ్, ఒడిషా మధ్య రోడ్డు రవాణా స్తంభించిపోయింది. రైల్వే ట్రాక్స్ మునిగిపోవడంతో పలు రైళ్లను రద్దును చేశారు లేదా దారి మళ్లించారు. పత్తి, వరి పంటలు నీట మునిగియా. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.












Click it and Unblock the Notifications