ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: తగ్గిన రికవరీ, జిల్లాల వారీగా కొత్త కేసులు, ఆంక్షల విధింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 2వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 82,297 నమూనాలను పరీక్షించగా.. 2145 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2145 కరోనా కేసులు, 24 మంది మృతి
తాజాగా నమోదైన 2145 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 24 మంది మృతి చెందారు.
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఐదుగురు మరణించగా, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,468 మృతి చెందారు.

ఏపీలో 20,302 కరోనా కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,003 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,42,371కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 20,302 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,49,46,265 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 428 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో 28 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 36, చిత్తూరులో 369, తూర్పుగోదావరిలో 428, గుంటూరులో 181, కడపలో 103, కృష్ణాలో 251, కర్నూలులో 54, నెల్లూరులో 304, ప్రకాశంలో 160, శ్రీకాకుళంలో 34, విశాఖపట్నంలో 89, విజయనగరంలో 28, పశ్చిమగోదావరిలో 108 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,79,192, చిత్తూరులో 2,32,690 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,561) కరోనా కేసులున్నాయి.
Recommended Video

తూర్పుగోదావరి, నెల్లూరులో కరోనా ఆంక్షలు అమలు
కరోనా కేసులు ఉధృతి కొనసాగుతున్న క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఆంక్షలను విధిస్తున్నారు. రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేవారు. రాజమండ్రిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కార్పొరేషన్‌లో దరఖాస్తు, అనుమతి తప్పనిసరి చేశారు కమిషనర్ కిశోర్. ఇక దుకాణాలు, షాపింగ్ మాల్స్ వద్ద ఎక్కువగా జనం గుమిగూడితే యాజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు హెచ్చరించారు. కరోనా నిబంధనలను పాటించని దుకాణాలను 2007 విపత్తు నిర్వహణ చట్టాల కింద మూసివేస్తామని స్పష్టం చేశారు. రాజోలు మండలంలో శుక్రవారం నుంచి కరోనా కట్టడి ఆంక్షలు అమలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుందని, కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రాజోలు తాహసీల్దార్ ముక్తేశ్వరరావు తెలిపారు. మరోవైపు నెల్లూరులోనూ కరోనా ఆంక్షలను విధించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని నెల్లూరు కమిషనర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కరోనా పాజిటివిటీ రేటు 4.5 శాతంగా ఉందని, దాన్ని 2 శాతానికి తగ్గించేందుకే నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నెల్లూరులో ప్రతి వందమందిలో నలుగురు నుంచి ఐదుగురికి కరోనా సోకడం గమనార్హం. సాయంత్రం నుంచి దుకాణాలను మూసివేయాలని కమిషన్ కోరడంతో వ్యాపారస్తులు కూడా అందుకు అంగీకరించారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కరోనా ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications