రాజధాని రణభేరి: సీమ, ఉత్తరాంధ్రలోనూ సేవ్ అమరావతి: అంగుళం కూడా కదలనివ్వం: టీడీపీ స్ట్రాటజీ
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు, ఆందోళనలు ఆదివారం నాటికి 250వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు తమ నిరసన ప్రదర్శనలను మరింత తీవ్రతరం చేశారు. రాజధాని రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సేవ్ అమరావతి పేరుతో నిరసన దీక్షలు వెల్లువెత్తుతున్నాయి.

విభిన్న రూపాల్లో..
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత రైతులు చేస్తోన్న దీక్షలు, వ్యతిరేక ప్రదర్శనలకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి తమ గళాన్ని విభిన్న రూపాల్లో వినిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ గళం వినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్టీలు ప్లేట్లు, డప్పు చప్పుళ్లతో..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళలను చేపట్టారు. శిబిరాల్లో పాల్గొన్న రైతులు, మహిళలు స్టీలు పేట్లను కొడుతూ ప్రభుత్వానికి తమ వ్యతిరేతకను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. స్టీలు ప్లేట్లు, డప్పు చప్పుళ్లతో అమరావతి ప్రాంతం మారుమోగిపోతోంది. అమరావతి ప్రాంత పరిధిలోని తాడేపల్లి, మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం,రాయపూడి, తాడికొండ, క్రోసూరు, అచ్చంపేట, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

టీడీపీ నేతల మద్దతు..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ చెట్లను నాటి నిరసన తెలిపారు. మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. కృష్ణాజిల్లా పెనమలూరులోని టీడీపీ కార్యాలయంలో నిరసన దీక్షకు కూర్చున్నారు. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు మందడంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్.. తుళ్లూరులో పార్టీ కార్యాలయంలో మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. అమరావతిని అంగుళం కూడా కదలనివ్వబోమని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అని హెచ్చరించారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ..
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సేవ్ అమరావతి ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు వంటి జిల్లాల్లోనూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. సేవ్ అమరావతి అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు టీడీపీ మద్దతుదారులు. స్థానికంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ తెలంగాణ అంబేద్కర్ సంఘం ప్రతినిధులు అమరావతి ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

అన్నీ అమరిన అమరావతిని..
అన్నీ అమరిన అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని పరిరక్షణ సమితి నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సచివాలయం, హైకోర్టు వంటి భవనాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి, తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని అంటున్నారు. వందల కోట్ల రూపాయలతో సచివాలయాన్ని, హైకోర్టును చంద్రబాబు నిర్మించారని, ఇప్పుడు వాటిని తరలించడం వల్ల అవన్నీ వృధా అవుతాయని చెబుతున్నారు. అమరావతిని అంగుళం కూడా కదలనివ్వబోమని చెబుతున్నారు.