ఫొటోలు: ఎక్కడో పుట్టి ఇక్కడ మృత్యువు ఓడిలోకి...
నెల్లూరు: నెల్లూరులోని సుందరయ్య కాలనీ సెంటర్ జాతీయ రహదారిపై ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు బీహార్ పోలీసులు ఉన్నారు. ఎక్కడో పుట్టి ఇక్కడ అకారణంగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దురు బీహార్ పోలీసులు, మరో ముగ్గురు స్థానికులు ఉన్నారు.

బీహార్ రాష్ట్రంలోని ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఎన్నికల అధికారి, బ్లాక్ అగ్రి కల్చరల్ ఆఫీసర్ షఖీల్ అహ్మద్‌ఖాన్‌తోపాటు ఐదుగురు ఆర్ముడ్ రిజర్వర్డ్ (ఏఆర్) పోలీసులు మరమ్మతుకు గురైన ఇవిఎంలను తీసుకొని బెంగళూరుకు వెళ్లి అక్కడ ఉన్న భెల్ కంపెనీ అప్పగించి తిరిగి ఇన్నోవా కారులో బీహార్‌కు బయలుదేరారు.
ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారు టైరు పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొని ఆగింది. కారు పూర్తిగా పాడవడంతో కారును అలాగే ఉంచి మెకానిక్ కోసం కారులో వచ్చిన అగ్రికల్చరల్ ఆఫీసర్ షఖీల్, ఎఆర్ కానిస్టేబుళ్లు బీహార్‌లోని బోజ్‌పూర్ జిల్లా చెక్కమ్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్‌రామ్, చప్రా జిల్లాకు చెందిన అశోక్ కుమార్‌సింగ్, డ్రైవర్ సంతోష్‌కుమార్ వెళ్లారు. మిగిలిన నలుగురు కానిస్టేబుల్స్‌లో ఒకరికి వెన్నునొప్పి తీవ్రం కావడంతో అక్కడి నుంచే 108కు ఫోన్ చేశారు.

స్థానికుల సాయంతో కారులో ఉన్న కానిస్టేబుల్‌ను 108 వాహనంలో ఎక్కిస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ లారీ కారు, అంబులెన్స్‌ను ఢీకొంది. అంబులెన్స్ అవతల రోడ్డులోకి వేగంగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమాదం నిమిషాల్లో జరిగిపోయింది. ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ మన్గర్ సింగ్ (45), కానిస్టేబుళ్లు కమల్ అహ్మద్‌ఖాన్ (38), సంజిత్ కుమార్ (38)తోపాటు సహాయ పడేందుకు వచ్చిన సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మధు ప్రభాకర్ (16), పడారుపల్లికి చెందిన తక్కోలు నాగేశ్వరరావు(40) అక్కడికక్కడే మృతిచెందారు. 108 వాహనం డ్రైవర్ హరిమణి, టెక్నిషియన్ శ్రీనివాసులు, స్థానికుడు నాసర్ తీవ్రంగా గాయపడ్డారు. అగ్రికల్చరల్ ఆఫీసర్, ఇద్దరు కానిస్టేబుళ్లు, కారు డ్రైవర్ మెకానిక్ కోసం బయటకు వెళ్లడంతో ప్రమాదం నుండి బయట పడ్డారు.
పోలీసులు గాయపడిన 108 సిబ్బందిని చికిత్స నిమిత్తం మరో అంబులెన్స్‌లో నారాయణ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో ఐదవ నగర పోలీస్‌స్టేషన్ వద్దకు తరలించారు. అతివేగంగా వచ్చిన లారీ మృతదేహాలను 500 మీటర్లకు లాక్కొనిపోయింది. అంతటితో డ్రైవర్ లారీని ఆపకుండా కొండాయపాళెం సమీపంలో లారీని వదిలేసి పరారయ్యాడు.












Click it and Unblock the Notifications