ఏపీలో అంతుచిక్కని వ్యాధితో 35మంది మృతి: వైఎస్ షర్మిల డిమాండ్లు!
గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో గత ఐదు నెలల కాలంలో 35 మంది దాకా మృతి చెందారని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురకపాలెం మరణ మృదంగమే నిదర్శనం అని ఆమె మండిపడ్డారు
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఉన్నట్టా లేనట్టా?
గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే వైద్యారోగ్య శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నట్లా ? లేనట్లా ? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటిదాకా 35 మంది ఒకేవిధంగా మృత్యువాత పడితే కారణం కనుక్కొని అరికట్టకపోవడం సిగ్గుచేటు అంటూ కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అంతుచిక్కని వ్యాధి ఇంకా ఎంతమందిని బలి గోరుతుందోనని గ్రామస్థులు హడలిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని షర్మిల అన్నారు.

ఉన్నతస్థాయి కమిటీ వేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలి
ప్రజలు ప్రాణభయంతో విలవిల్లాడుతుంటే మహమ్మారిని అదుపు చేయకపోవడం అత్యంత బాధాకరం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్న వైయస్ షర్మిల తురకపాలెం మృత్యుఘోషపై వెంటనే స్పందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ పరంగా తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయాలని ఆమె కోరారు.
ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్న వైఎస్ షర్మిల
గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు . అసలు తురకపాలెం లో మరణాలకు కల్తీ నీళ్లు కారణమా ? కల్తీ లిక్కర్ తో సంభవిస్తున్న మరణాలా ? అనేది అధ్యయనం చేయాలని, గ్రామంలో పారిశుద్ధ్య లోపమా ? ఇంకేమైనా కారణం ఉందా ? అనేది తెలుసుకోవాలన్నారు.
మృతుల ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
అంతుచిక్కని మరణాలకు గల కారణాలను వెంటనే తేల్చి నివారణ చర్యలు చేపట్టాలని వై.ఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సకాలంలో ప్రభుత్వం స్పందించని కారణంగా జరిగిన మరణాలకు భాద్యత వహించి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం అని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications