ఏపీలో కరోనా కల్లోలం: కొత్తగా 4528 కేసులు, 18వేలు దాటిన యాక్టివ్ కేసులు, మంత్రి అవంతికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా నాలుగువేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 39,816 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 4528 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైనా మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది.

ఏపీలో కొత్తగా 18వేలకుపైగా యాక్టివ్ కేసులు
కరోనా బారినపడి ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనాబారి నుంచి గురువారం 418 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య
20,61,039కి చేరింది. ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

అత్యధికంగా చిత్తూరులో వెయ్యికిపైగా కరోనా కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,17,96,337 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు గమనించినట్లయితే..
అనంతపురం జిల్లాలో 300, చిత్తూరులో 1027, తూర్పు గోదావరిలో 327, గుంటూరులో 377, వైఎస్ఆర్ కడపలో 236, కృష్ణాలో 166, కర్నూలులో 164, నెల్లూరులో 229, ప్రకాశంలో 142, శ్రీకాకుళంలో 385, విశాఖపట్టణంలో 992, విజయనగరం జిల్లాలో 121, పశ్చిమగోదావరి జిల్లాలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి.

మంత్రి అవంతికి కరోనా పాజిటివ్
సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి ఎవరూ రావొద్దని, ఏదైనా అత్యవసరమైతే తనను ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు. అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఫస్ట్ వేవ్ సమయంలో కూడా ఆయనకు కరోనా సోకింది.

తెలంగాణ మంత్రి తలసానిని కలిసిన అవంతి శ్రీనివాస్..
కాగా, గురువారం వైకుంఠ ఏకాదశి కావడంతో మంత్రి అవంతి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సుపథం వద్ద ఆయన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను ఆలింగనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వారం క్రితమే ఆయన రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దేశంలో రెండున్నర లక్షలకుపైగా కరోనా కేసులు
మరోవైపు, దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా కొత్తగా మరో 315 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,09,345 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కాగా, దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,582,129కు చేరింది. దేశంలో మొత్తం కరోనా మరణాలు 4,85,350కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073కు పెరిగింది. ఇప్పటి వరకు 3,48,24,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి వైరస్ సోకినా పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ, దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాద తీవ్రత పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు కీలక సూచనలు చేశారు. ]












Click it and Unblock the Notifications