ఒక్కరూపాయి ఖర్చు లేకుండా మీ దగ్గరకే వైద్యం.. ఇదే చంద్రబాబు ఆరోగ్య రథం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అందిస్తూనే, ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య రక్షణ పైన కూడా చంద్రబాబు ప్రత్యేకమైన దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకాన్ని 25 లక్షలకు పెంపు చేసిన చంద్రబాబు యూనివర్సల్ హెల్త్ పాలసీని అందిస్తున్నారు.
ఏపీలో సిద్ధమైన ఆరోగ్య రథం
మారుమూల గ్రామీణ ప్రాంతాలలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే 104 సంచార వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే మరింత సమర్థవంతంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య రధం పేరుతో ఉన్న నమూనా వాహనాలను సిద్ధం చేశారు.

47 రకాల వైద్య పరీక్షలతో పాటు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈ వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి రోగుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ఆమోదం పొందిన వెంటనే ఈ కొత్త వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
104 మొబైల్ మెడికల్ వాహనాలతో ఈ ఇబ్బందులు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 936 వరకు 104 మొబైల్ మెడికల్ యూనిట్లు పనిచేస్తున్నాయి. అయితే ఇవి తరచూ మరమ్మతులకు రావడంతో ప్రతి వాహనం నెలకు కేవలం రెండుసార్లు మాత్రమే గ్రామాలకు వెళుతున్న పరిస్థితి ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు .
ఆరోగ్య రథాలతో మెరుగైన వైద్యానికి చంద్రబాబు ప్లాన్
ఈ క్రమంలోనే కొత్త ఆరోగ్య రథాలను తీసుకువచ్చి , వైద్య బృందంతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ లను కూడా పంపి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి చంద్రబాబు సంకల్పించారు. ఈ ఆరోగ్య రధాలు గ్రామంలో ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రజల నుండి అవసరమైన నమూనాలను సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అప్పుడే
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు చేరవేస్తారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం అయితే ముందు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలోకి విస్తరించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications