ఏపీలో ఈ విద్యాసంవత్సరం అందుబాటులోకి 5ప్రభుత్వ వైద్య కళాశాలలు; 750మెడికల్ సీట్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తూ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిందని ఆయన తెలిపారు.
విజయనగరంలోని గాజులరేగ వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను ఆయన పరిశీలించారు. ఏపీఎంఎస్ఐడిసి యండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తో పాటు ఇతర అధికారులతో కలిసి గాజులరేగ వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను పరిశీలించిన ఆయన వైద్య కళాశాలకు సంబంధించిన తరగతి గదులు, హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.

రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. తొలివిడతగా విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామని పేర్కొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు వచ్చే విద్యాసంవత్సరం నుంచే వాటిని ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇప్పటికే ఈ కళాశాలల్లో నాలుగింటికి అనుమతులు కూడా లభించాయని తెలిపి రాజమండ్రి వైద్య కళాశాలకు మరికొద్ది రోజుల్లో అనుమతులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 15 నాటికి ఈ కళాశాలల తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి ఆగస్టు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా కళాశాలలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కళాశాలల ద్వారా 750మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
2024- 2025 విద్యాసంవత్సరంలో పాడేరు, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు, 2025- 2026 విద్యాసంవత్సరంలో మరో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఏపీలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి మెడిసిన్ సీట్లను పెంచుకోవడం ద్వారా, రాష్ట్రంలో వైద్యుల కొరతను అధిగమించడానికి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications