Talliki Vandanam: ఏపీలో తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి వారి ఖాతాల్లో జమ..!
ఏపీలో పాఠశాలలకు వెళ్లే పేద విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం (talliki vandanam) పథకంలో భాగంగా ఈ ఏడాది కూడా డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విద్యార్ధుల డేటా సేకరించిన అధికారులు.. వాటిని క్షేత్రస్దాయికి తనిఖీల కోసం పంపారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే త్వరలో ఈ మొత్తాల్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ ఏడాది మొత్తం 78 లక్షల మందికి తల్లికి వందనం పథకం మొత్తాన్ని అందించనున్నారు.
గతంలో లాగే ఈ ఏడాది కూడా తల్లికి వందనం పథకానికి అర్హులైన విద్యార్ధుల వివరాలను స్కూళ్ల నుంచి అధికారులు సేకరించారు. ఈ డేటాను సచివాలయాల్లోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సంక్షేమ కార్యదర్శులకు పంపారు. వీరు క్షేత్రస్ధాయిలో ఈ డేటా ఆధారంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పటికే 78 లక్షల మంది విద్యార్ధుల్ని తల్లికి వందనం పథకానికి అర్హులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరి వివరాలు తనిఖీ చేసి అనర్హులు ఉంటే తొలగిస్తారు.

గతేడాది తల్లికి వందనం పథకం కింద ఏపీ ప్రభుత్వం రూ.8711 కోట్లు విద్యార్ధుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది కూడా భారీ మొత్తాన్ని విద్యార్ధులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ లింకింగ్, ఎన్సీపీఐ లింకింగ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు జమ చేసినప్పుడు వాటిని పొందేలా చూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్దుల తల్లితండ్రులు స్థానిక సచివాలయాలను సంప్రదించి ఈ వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications