ఏపీలో మరోసారి 100లోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 28,254 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 79 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో 1154 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో కరోనా బారినపడిన ఏ ఒక్కరూ మరణించలేదు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 7157గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 87 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,79,867కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1154 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,32,42,502 నమూనాలను పరీక్షించారు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులు
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 5, చిత్తూరులో 5, గుంటూరులో 12, కృష్ణాలో 20, కర్నూలులో 1, నెల్లూరులో 3, ప్రకాశంలో 5, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 13, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశంలో భారీగా కోలుకుంటున్న కరోనా రోగులు
ఇక దేశంలోనూ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బుదవారం 12,899 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,07,90,183కి చేరింది. గత 24 గంటల్లో 107 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 1,54,703 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,55,025 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,824 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోటి 4లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. బుధవారం 3,10,604 మంది టీకా వేయించుకున్నారు. ఇక నిన్నటి వరకు వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 44,49,552కి చేరింది.