డబ్బులిచ్చినా..: చేతులూ కాళ్లూ కట్టేసి మెడకు ఉరిపెట్టి చంపారు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని తాళ్లూరులోని ఏటీ అగ్రహారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈనెల 14వ కిడ్నాపైన బాలుడు యాదిత్యరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఫిరంగిపురం మండలం తాళ్లూరు చెరువులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.15 లక్షలు ఇవ్వాలంటూ బాలుడి తల్లితో ఫోన్లో బెదిరించారు. కాగా బాలుడి తల్లి కిడ్నాపర్లకు రూ.2 లక్షలు ఇచ్చింది. అయినా కనికరించిన దుండుగులు బాలుడిని హత్య చేసి చెరువులో పడేశారు.

దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్లే ఆ 8 ఏళ్ల బాలుడ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు చాలా వరకు ముట్టినా బాలుడ్ని ఎందుకు చంపేశారనేది మిస్టరీగా మారింది.
తాము పట్టుబడుతామని భయపడి హత్య చేశారా, మరేదైనా కారణం ఉందా అనేది తేలడం లేదు. మొత్తం మీద, కిడ్నాపర్లు బాలుడి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చారు.
బాలుడ్ని ట్యూషన్ వెళ్లి వస్తుండగా కిడ్నాప్ చేశారు. పోలీసులకు తెలియకుండా తల్లిదండ్రులు కిడ్పాపర్లకు డబ్బులు ఇచ్చారు. అయితే, ఆస్తి తగాదాలు ఏమైనా బాలుడి హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైలులోకి కిటికీల గుండా డబ్బులు విసిరేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కిడ్నాపర్లు ఫోన్ చేయడం మానేసినట్లు చెబుతున్నారు. పథకం ప్రకారం హత్య చేశారని బాలుడి తల్లిదండ్రు అంటున్నారు. సమీప బంధువులపై బాలుడి తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఫోన్‌లోనూ ఫేస్‌బుక్‌లోనూ బాలుడు చాలా చురుగ్గా ఉంటాడని, దాంతో బాలుడి స్నేహితుల వద్ద కూడా ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. కాళ్లూ చేతులూ కట్టేసి హత్య చేశారని చెప్పారు. కాళ్లూ చేతులను కట్టేసి ఆ వైర్‌తోనే మెడకు ఉరేసి చంపారని వారు చెబుతున్నారు.
మూడు నాలుగు రోజుల క్రితమే బాలుడిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, తమ వద్ద తగిన సమాచారం ఉందని చెప్పారు. సిసిటీవీ ఫుటేజీలను కూడా సేకరించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications