ఏపీలో కరోనా కల్లోలం: వెయ్యికి చేరువలో కొత్త కేసులు, ఆ 4 జిల్లాల్లో సెంచరీ దాటాయి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి కల్లోలం సృష్టిస్తోంది.
ఒక్క రోజు వ్యవధిలో సుమారు వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,604 నమూనాలను పరీక్షించగా.. 984 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కరోనా విజృంభణ, 4 వేలు దాటిన యాక్టివ్ కేసులు
తాజాగా నమోదైన 984 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,96,863కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7,203 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 306 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,85,515కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,145 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,49,16,201 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 46, చిత్తూరులో 163, తూర్పుగోదావరిలో 49, గుంటూరులో 176, కడపలో 31, కృష్ణాలో 110, కర్నూలులో 54, నెల్లూరులో 89, ప్రకాశంలో 27, శ్రీకాకుళంలో 42, విశాఖపట్నంలో 170,
విజయనగరంలో 15, పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ
దేశ వ్యాప్తంగానూ కరోనా కేసుల్లో ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,00,756 కోరనా పరీక్షలు నిర్వహించగా.. 59,118 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి18 లక్షలకు చేరింది. కొత్తగా 32,987 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 257 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1.60,949కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 2,64,001 యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 23,58,731 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 5,55,04,440కి చేరింది.












Click it and Unblock the Notifications