పవన్.. ఎంతమందిని తొక్కి నారా తీశారు
Tirupati: తిరుపతి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. అనంతరం దారుణంగా హతమార్చాడు. జిల్లాలోని వడమాలపేట మండలం ఏఎం పురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైంది.
ఏఎం పురంలో నివసించే చిన్నారిపై అదే గ్రామానికి చెందిన సుశాంత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్లు ఇస్తానంటూ మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్ళాడు. అత్యాచారం చేసి, హతమార్చాడు. మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టాడు. చిన్నారి కోసం తల్లిదండ్రులు విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు సుశాంత్‌ను అరెస్ట్ చేశారు. ఆ చిన్నారి కుటుంబానికి బంధువేనని తేలింది.
ఈ ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా స్పందించారు. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తన సొంత జిల్లాలో వరుసగా చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోన్నారని మండిపడ్డారు.
ఇలాంటి ఘటనల పట్ల తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్ సిగ్గుపడాలని రోజా అన్నారు. చిన్నారి కుటుంబాన్ని భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి ఆమె పరామర్శించారు. ఈ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత సిగ్గుతో తలదించుకోవాలని రోజా అన్నారు. ఆడవాళ్లకు చిన్న కష్టం వచ్చినా తొక్కి నార తీస్తామంటూ పవన్ చెప్పిన మాటలను రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతవరకు ఎంత మందిని తొక్కి నార తీశారని ప్రశ్నించారు.
హోం మంత్రి అనిత ఎందుకు స్పందించట్లేదంటూ రోజా నిలదీశారు. మద్యం మత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని, దీనికి కారణం మద్యం షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడమేనని రోజా చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలని, బెల్ట్‌షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు.
సొంత జిల్లాలో 16 ఏళ్ల అమ్మాయికి మత్తు మందు పెట్టి చంపేశారని, ఈ రోజుకు కూడా పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని రోజా చెప్పారు. హిందూపురంలో అత్తా కోడళ్లపై అత్యాచారం చేస్తే స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అటువైపు కూడా తొంగి చూడలేదని అన్నారు.












Click it and Unblock the Notifications