వరదనీటిలో వరుడి ఇంటికి పడవలో వధువు ప్రయాణం; కోనసీమలో పెళ్లి కష్టాలు: వీడియో వైరల్
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. వరద నీటిలో ప్రజలు రాకపోకలు సాగించ లేక పడరాని పాట్లు పడుతున్నారు. కోనసీమ ప్రాంతంలోని అనేక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ఇక ఇదే సమయంలో కోనసీమలో వరద ఓ పెళ్లి ఇంట ఇక్కట్లకు కారణంగా మారింది. ఇక వరుడు ఇంటికి వధువుని పడవలో తీసుకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోనసీమలో వరద ముంపు .. ఓ వధువు పెళ్లి కష్టాలు
కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పెదపట్నం లంకలోని అప్పన్నపల్లిలో నల్ల వారి ఇంట జరగాల్సిన పెళ్లికి వరద అడ్డంకిగా మారింది. వధువు ప్రశాంతిని, కేశనపల్లికి చెందిన వరుడు అశోక్ కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు సుముహూర్తం నిర్ణయించారు. ఆగస్టు నెలలో వర్షాలు వరదలు ఎక్కువగా ఉంటాయని, వరద కష్టాలు ఇబ్బంది పెడతాయని భావించి జూలై నెలలోనే ముహూర్తం పెట్టుకున్నారు వధూవరుల కుటుంబ సభ్యులు. అయితే ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి నదికి వరదలు ముంచెత్తడం వంటి ఘటనలతో కోనసీమ ప్రాంతంలో అనేక గ్రామాలు నీట మునిగాయి.

వధువు పడవలో వరుడి ఇంటికి ప్రయాణం ..పట్టు చీర, ఆభరణాలతో ముస్తాబు
ప్రశాంతి, అశోక్ ల పెళ్లికి వరదలు అడ్డంకిగా మారాయి. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించి తీరాలని నిర్ణయించిన వధూవరుల కుటుంబాలు, అందుకు తగిన నిర్ణయం తీసుకున్నారు. వరదల కారణంగా నిర్ణయించుకున్న చోట పెళ్లి జరపలేక, వరుడు ఇంటి వద్ద వివాహం చేయడానికి నిర్ణయించిన వధువు బంధువులు, పెళ్లికూతురిని పట్టు చీరలు, ఆభరణాలతో ముస్తాబు చేసి పడవలో వరుడు ఇంటికి తీసుకెళ్ళారు. కోనసీమ గ్రామాలలో వరద గ్రామాలలో వధువు పడవ ప్రయాణం సాగింది.
వధువుతో పాటు కుటుంబ సభ్యులు .. పెళ్లిపై వారు చెప్తుంది ఇదే
కోనసీమ వరదలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి, పెళ్లి చేసుకోవడానికి వరుడి ఇంటికి వెళ్తున్న వధువు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమెతో పాటు వధువు కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆ పడవలో ఉన్నారు. ఈ దృశ్యాలు కోనసీమలోని వరదల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వర్షాకాలం కావటంతో నెల ముందు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నామని, అయినా గంగమ్మ వదలలేదని వధువు బంధువులు చెప్తున్నారు.

వరద పరిస్థితులలో పెళ్లి .. కోనసీమ వరద కష్టాలకు అద్దం
ఇక ఈరోజు ఉదయం అశోక్, ప్రశాంతి ల పెళ్లి కావడంతో వరద సృష్టించిన ఇబ్బందిని ఎదుర్కొని మరీ ఇరువురు ఒకటి కాబోతున్నారు. ఏది ఏమైనా కోనసీమ జిల్లాలో వరద కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజల అనేక వీడియోలు, అక్కడ తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. గోదావరికి మరింత వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, కోనసీమ లోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications