కిలాడీ జంట: సినీ ఫక్కీలో జువెల్లరీ షాపులో బంగారు నగల చోరీ

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: జిల్లాలోని సుళ్లూరిపేటలో ఓ జంట సినిమా ఫక్కీ‌లో దొంగతనాలకు తెగబడింది. ఓ నగలదుకాణం యజమానిని మోసం చేసి 3 సవర్ల బంగారంతో పరారైంది. వివరాల్లోకి వెళితే.. సుళ్లూరుపేట స్థానిక పార్కువీధిలోని శ్రీలక్ష్మి జువెల్లర్స్‌ దుకాణానికి మంగళవారం భార్య, భర్తలంటూ ఇద్దరు వచ్చారు. తన పేరు ప్రసాద్‌రెడ్డి అని డీవోఎస్‌ కాలనీ ఎదురుగా వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నామని చెప్పారు.

అంతేగాక, తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌ అంటూ ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆభరణాలు చూపమన్నారు. రెండు సవర్ల చైను, ఒక సవర బుట్టకమ్మలు ఎంపిక చేశారు. వాటిని దుకాణంలో ఉంచమని గురువారం మంచి రోజని అప్పుడు తీసుకెళ్తామని దుకాణం యజమాని అంబూరు గోపీ ఆచారిని నమ్మించారు.

అయితే, శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆ వ్యక్తి మోటారు సైకిల్‌పై దుకాణానికి వచ్చాడు. తాము ఎంపిక చేసుకున్న నగలుకు బిల్లు వేయించాడు. 75వేల రూపాయలు బిల్లు కావడంతో దుకాణంలోని ఉద్యోగికి నగలు ఇచ్చి తనతో పంపితే ఇంటి వద్ద డబ్బులు ఇస్తానని నమ్మించాడు. దీంతో దుకాణం యజమాని శివకుమార్‌ అనే యువకుడికి నగలు ఇచ్చి పంపాడు.

A couple thefts gold in a jewellery shop

ఆ వ్యక్తి మోటారు సైకిల్‌పై శివకుమార్‌ను ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో రైల్వేగేట్‌ వద్ద మోటారు సైకిల్‌ ఆపి తన భార్యకు ఫోన్‌ చేశాడు.
నగలు తీసుకుని వస్తున్నానని ఇంట్లో కవర్‌లోపెట్టి ఉన్న డబ్బులను తీసుకుని కిందకు రమ్మని చెప్పాడు.

ఇంటి వద్దకు వెళ్లే సరికి ఆ మహిళ అపార్ట్‌మెం ట్‌ గేట్‌ ముందు కవర్‌తో సిద్ధంగా ఉంది. కవర్‌ను భర్త చేతికిచ్చి తన తల్లి కోసం 5వేల రూపాయలు తీశానని చెప్పింది. దీంతో ఆవ్యక్తి ఆమెపై చిరుకోపం ప్రదర్శించాడు.

ఏటిఎం వద్దకెళ్లి రూ. 5వేలు డ్రాచేసి మొత్తం డబ్బు ఇస్తానని శివకుమార్‌కు చెప్పి తన భార్యకు నగలు ఇప్పించాడు. ఆ తర్వాత శివకుమార్‌ను ఎక్కించుకుని షార్‌ సర్కిల్‌‌లోని ఏటీఎం వద్దకెళ్లారు. లోపలికి వెళ్తూ హఠాత్తుగా జేబులు తడుముకుని ఏటీఎంకార్డు మరచిపోయానని నటించాడు. ఇంటికెళ్లి ఏటీఎం కార్డు తెస్తానంటూ శివకుమార్‌ను అక్కడే ఉంచి వెళ్లిపోయాడు.

అతను ఎంతకీ ఏటిఎం వద్దకు రాకపోవడంతో మోసపోయామని శివకుమార్‌ గుర్తించాడు. యజమానికి సమాచారం అందించాడు. నగలదుకాణ వ్యాపారస్థులకు ఈ విషయం తెలియడంతో మరో ఐదు దుకాణాల్లో ఆ జంట నగలను ఎంపిక చేసుకుని మరలా వస్తామంటూ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నగల దుకాణాల సీసీ కెమెరాలలో ఆ వ్యక్తి చిత్రాలను గుర్తించారు. ఆ వ్యక్తి నివసిస్తున్నాడన్న అపార్ట్‌మెంట్‌ వద్దకెళ్లి విచారించగా అపార్ట్‌మెంట్‌పై అంతస్తులో ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి నివసిస్తున్నట్లు బోర్డు ఉంది. అయితే ఆ ప్రసాద్‌రెడ్డి వేరే వ్యక్తి అని ఆ పేరును ఉపయోగించి మోసం చేసినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నాన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A couple thefts gold in a jewellery shop.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి