టీటీడీకి అరుదైన విరాళం.. అదే దాని ప్రత్యేకత
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 75,303 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,166 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.99 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుపతిలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ కోదండరామ స్వామివారికి శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దాత బంగారు తులసి హారం బహుకరించారు. దీని విలువ 26 లక్షల రూపాయలు. 257 గ్రాముల బంగారు తులసి మాల ఇది. ఇందులో పొందుపరిచిన తులసీదళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కించడం.. దీని ప్రత్యేకత.
ఈ హారాన్ని కోదండరామస్వామి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి నాగరత్నకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద కుమార్ దీక్షితులు, టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇటీవలే హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి మూడు కోట్ల విలువైన ఇళ్లు, బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షల రూపాయలను విరాళంగా అందించి శ్రీవారిపై తనకు ఉన్న అచంచలమైన భక్తిని చాటుకున్నారు.
భాస్కర్ రావుకు హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న ఆనంద నిలయం పేరుతో 3,500 చదరపు అడుగులు గల భవనం ఉంది. దీన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో దీన్ని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.
ఆయన స్ఫూర్తితో హైదరాబాద్ కే చెందిన మరో భక్తురాలు టీటీడీకి తమ ఆస్తి మొత్తాన్ని కూడా రాసిచ్చారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి వసంతపురి కాలనీకి చెందిన టీ సునీత దేవి, టీ కనక దుర్గ ప్రసాద్ దంపతులు 18.75 లక్షల రూపాయల విలువ చేసే 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు.
టీ సునీత దేవి, టీ కనక దుర్గ ప్రసాద్ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. ఆస్తి పత్రాలను తిరుమలలో అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి అందజేశారు.












Click it and Unblock the Notifications