8వ తరగతి చదవి.. ఫ్రొఫెసరయ్యాడు: దొరికి జైలుపాలు
చెన్నై: అతడు చదవింది 8వ తరగతే.. అయితేనే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ)లో పిహెచ్‌డి చేసినట్లుగా సర్టిఫికేట్లు తయారు చేయించుకున్నాడు. ఇంకేందుకు ఆలస్యం అన్నట్లుగా ఓ కళాశాల ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తనకు వచ్చిన విద్యనంతా అక్కడ ప్రదర్శించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నెలకు రూ. 1.12 లక్షల వేతనం ఇవ్వడం కూడా జరిపోయింది.
మూడేళ్లపాటు విద్యార్థులు ఆయన చెప్పే పాఠాలు విన్నారు. చివరకు సహచర అధ్యాపకుడికి వచ్చిన ఒక చిన్న అనుమానంతో ఈ నకిలీ ప్రొఫెసర్ దొరికిపోయి జైలుపాలుయ్యాడు. ఇదంతా నకిలీ పట్టాలు సృష్టించి ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్న గుంటూరు యువకుడు అశోక్‌కుమార్ చౌదరి అలియాస్ బి.రవికుమార్‌రెడ్డి గురించి. కాగా, అశోక్ కుమార్ చౌదరిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు దర్యాప్తులో నిందితుడు అశోక్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోవడం పోలీసులు, కళాశాల అధికారుల వంతైంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన అశోక్‌కుమార్ నిజానికి ఎనిమిదో తరగతి మధ్యలోనే చదువు ఆపేశాడు. కానీ పెద్ద ఉద్యోగం చేయాలనేది అతడి ఆశ. కొన్నాళ్లు గుంటూరులోని ఒక జిరాక్స్ సెంటర్లో పనిచేశాడు. అక్కడ విద్యార్థుల పాఠ్యపుస్తకాలకు నకళ్లు తీసే సమయంలోనే తానూ ఆ ప్రతులు తీసుకుని చదువుకునేవాడు. అలా చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. చదువు లేకపోవడంతో నకిలీ పట్టాలు సృష్టించి మంచి ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు.

ముందుగా ఐటీఐ ధ్రువపత్రం పొంది ఒక ప్రైవేటు సంస్థలో చేరాడు. తరువాత ఎమ్మెస్సీ ధ్రుపత్రం సృష్టించి క్యాట్ ప్రవేశ పరీక్ష రాయడానికి దిల్లీలోని ఓ శిక్షణ కేంద్రంలో చేరాడు. అక్కడ నిర్వాహకులు ఆయన ప్రతిభ గమనించి పార్ట్‌టైమ్ అధ్యాపకుడిగా ఉద్యోగమిచ్చారు. అప్పుడే ఆయనకు పీహెచ్‌డీ పట్టా సృష్టించాలనే ఆలోచన వచ్చింది.
బెంగళూరు ఐఐఎస్సీలో పీహెచ్‌డీ చేసిన బి. రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి పేరుతో నకిలీ ధ్రువపత్రం సృష్టించుకున్నాడు. దాన్ని చూపించి చెన్నై సమీపంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం.. వారు ట్రిపుల్‌ఈలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇవ్వడం జరిగిపోయాయి. నెలకు రూ.1.12 లక్షల వేతనం తీసుకుంటూ 2012 నుంచి అక్కడే పనిచేశాడు.
కాగా, విద్యార్థులకు పాఠాలు చెప్పే విషయంలోనూ నిందితుడు అశోక్ చౌదరిపై ఎవరికీ అనుమానాలు రాలేదు. తాను బోధించబోయే పాఠ్యాంశాలకు సంబంధించి ముందురోజే అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు చెప్పేవాడు. అయితే ఒకసారి కళాశాలకు అకాడమిక్ బృందం ఒకటి వచ్చింది. అందులో ఐఐఎస్సీకి చెందిన ఇద్దరు ఫ్రొఫెసర్లు ఉన్నారు.. వారిని కలవాలని కళాశాల యాజమాన్యం, సహచర అధ్యాపకులు ఎంతగా కోరినా రవికుమార్‌రెడ్డిగా నటిస్తున్న అశోక్ నిరాకరించాడు.
దీంతో కొందరు సహచరులకు అనుమానం వచ్చి ఆయన పీహెచ్‌డీ వివరాలను శోధించారు. అందులో బెంగళూరు ఐఐఎస్సీలో పీహెచ్‌డీ తీసుకున్న వారి జాబితాలో ఉన్న బి.రవికుమార్‌రెడ్డి, ఈ కాలేజీలో ఉన్న రవికుమార్‌రెడ్డి ఒక్కరు కాదని తేలిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు ఈ నకిలీ ప్రొఫెసర్ ఆటకట్టించడం జరిగిపోయింది.












Click it and Unblock the Notifications