నాగుల చవితి- కార్తీక సోమవారం : తిరుమలలోనూ - శివాలయాల్లో పోటెత్తిన భక్తులు..!!
రెండు పర్వదినాలు ఒకే రోజు రావటంతో ఉదయం నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి సోమవారం సాయంత్రం పెదశేషవాహన సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి దర్శనమిస్తారు. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తారు.కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలు మారు మోగుతున్నాయి.

ఆలయాలు కిటకిట
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగులచవితి కూడా కావడంతో మహిళలు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరం భక్త జనో సందోహంతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరి నది తీరాన భక్తులు స్నానం ఆచరించి శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

శైవ క్షేత్రాల్లో భక్త జన సందోహం
పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు హర హర మహాదేవ శంభో శంకర అంటూ మారుమోగుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం,నాగుల చవితి కలిసి రావడంతో ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ భీమేశ్వరాలయం భక్తులతో పోటెత్తాయి.భక్తులు శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు సోమవారం నాగుల చవితిని కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటున్నారు.

నాగుల చవితికి పోటెత్తిన మహిళా భక్తులు
దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ఓం నమ:శివాయ అంటూ శివాలయాలలో శివునికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, మహా రుద్రాభిషేకం, బిల్వార్చనలు, లక్ష బిల్వార్చన, సహస్ర లింగార్చన, రుద్ర హోమము, ఉంజల సేవ పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం నెలరోజులపాటు పూజా కార్యక్రమాలు చేయనున్నారు. నేటి నుండి సాయంత్రం వేళ ఆకాశదీపం ప్రారంభంకానుంది. మరోవైపు శివ మాలలతో పెద్ద సంఖ్యలో కృష్ణానది వద్ద శివ భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు.

కార్తీక దీపాలు..అభిషేకాలు
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications