క్షమాపణలు కోరిన సీఎం.. అసెంబ్లీ సాక్షిగా ఊహించని పరిణామం
తమిళనాడు శాసనసభ వేదికగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నాయకుల మధ్య తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగే వాగ్వాదం చోటుచేసుకుంది. బడ్జెట్ పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతున్న సమయంలో సభ ఒక్కసారిగా హీటెక్కింది. డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టీవీకే తన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
డీఎంకే విమర్శలకు ప్రతిదాడి చేస్తూ మంత్రి రంజిత్ కుమార్ గతంలో జరిగిన ఓట్ల కొనుగోలు వ్యవహారాలను తెరపైకి తెచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆయన తీవ్రమైన తొందరపాటు ప్రదర్శించారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం కరుణానిధి పేరును కనీస గౌరవం లేకుండా సాధారణంగా ప్రస్తావించారు. దీంతో డీఎంకే సభ్యులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. డీఎంకే సీనియర్ నాయకులు ఈవీ వేలు, కేఎన్ నెహ్రూలు లేచి మంత్రి తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవ చేసిన మహానాయకుడిని గౌరవించకపోవడం సభామర్యాదకే కళంకమని మండిపడుతూ ఆందోళనకు దిగడంతో సభలో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది.

అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు!
పరిస్థితి చెయ్యిదాటుతుండటంతో స్పీకర్ తక్షణమే జోక్యం చేసుకుని మంత్రి ప్రసంగాన్ని నిలిపివేశారు. సభా వ్యవహారాల మంత్రి సెంగోట్టయన్ కూడా స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు సభాప్రాంగణంలో ఉండదగినవి కావని పేర్కొన్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు మంత్రి రంజిత్ కుమార్ చేసిన వివాదాస్పద మాటలను వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు. అయినప్పటికీ డీఎంకే సభ్యుల నిరసన జ్వాలలు ఏమాత్రం చల్లారలేదు.
రంగంలోకి సీఎం విజయ్.. సభలోనే సారీ!
సభలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా మైక్ అందుకున్నారు. రూల్ 110 కింద కీలక ప్రకటనలు చేయడానికి ముందుగా ఆయన డీఎంకే సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తమ పార్టీ మంత్రి దివంగత నాయకుడు కరుణానిధి పేరును ఆ రీతిలో పలకడం ముమ్మాటికీ తప్పేనని సీఎం నిర్మోహమాటంగా అంగీకరించారు. "నా మంత్రి చేసిన తప్పునకు సభాపతి సమక్షంలో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని సభలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి విజయ్ చూపిన ఈ రాజకీయ పరిణతి, చొరవను డీఎంకే సీనియర్ నేత కేఎన్ నెహ్రూ తదితరులు హర్షించడంతో, దాదాపు గంటపాటు సాగిన అసెంబ్లీ రచ్చకు తెరపడింది.














Click it and Unblock the Notifications